ప్రజాశక్తి – నెల్లిమర్ల : సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో డ్రోన్ల తయారీ యూనిట్ ఏర్పాటు ఉత్తరాంధ్రకు ఓ మణికిరీటం వంటిదని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం ఆయన సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో సూపర్ బీ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ల తయారీ యూనిట్‌ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ డ్రోన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించడంతోపాటు పరిశ్రమలకు, మార్కెట్ అవసరాలను తీర్చడానికి దోహదపడుతుందన్నారు. వ్యవసాయ రంగంలో పురుగుల మందు వాడకాన్ని తగ్గించాలన్నా, వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గాలన్నా డ్రోన్ల వినియోగం పెరగాలన్నారు. అందువల్లనే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ డ్రోన్ల వాడకాన్ని పెంపొందించేందుకు పిఎల్‌ఐ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో డ్రోన్ల హబ్ ఏర్పాటు చేసేందుకు డ్రోన్ పాలసీని తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో డ్రోన్ల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి వాడకాన్ని పెంపొందించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారన్నారు. భవిష్యత్‌లో డ్రోన్లకు సంబంధించి ఉత్తరాంధ్రకు సెంచూరియన్ ప్రధాన కేంద్రంగా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన జైరోప్లేన్ (తక్కువ ఎత్తులో ఎగిరే విమానం), ఇ-రిక్షాల తయారీ, కుట్టు యంత్రాల యూనిట్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎఆర్విఆర్ ల్యాబ్, 3డి ప్రింటింగ్, ఇతర పరికరాలు, విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు తిలకించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో సాధించిన అభివృద్ధి గురించి విశ్వవిద్యాలయ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డి.ఎన్.రావు వారికి వివరించారు.హెల్త్ కేర్ ఆన్ వీల్స్ ప్రారంభంఈ సందర్భంగా సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్త్ కేర్ ఆన్ వీల్స్ వాహనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ కేవలం బయట ఆసుపత్రులలో వివిధ వైద్య పరీక్షలకు రూ.2వేలు వసూలు చేసే పరిస్థితి ఉండగా ఈ వాహనం ద్వారా కేవలం రూ.200 పలు రకాల వైద్య పరీక్షలు చేసుకునే వీలుందన్నారు. వైద్య సేవల కోసం ఈ వాహనం అన్ని పంచాయతీలలో పర్యటించనుందని వివరించారు.అవగాహనా ఒప్పందంముంబయికి చెందిన స్మార్ట్ విలేజి మూమెంట్ సిఇఒ వివేక్ షా సెంచూరియన్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎస్.ఎన్.రాజు, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ వర్మ, బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ రాధాకాంత్ పాడి, వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డి.ఎన్.రావు సతీమణి పద్మ, గ్రామ్ తరంగ్ అండ్ సూపర్ బీ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ శివానంద్, యాజమాన్య ప్రతినిధి ఎస్. రవీంద్ర, పలువురు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.