విపత్తులు తలెత్తకుండా జాగ్రత్తలు

Feb 5,2025 21:10

ప్రజాశక్తి – గుర్ల : విపత్తులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని డిప్యూటీ తహశీల్దార్‌ వి.నారాయణమ్మ సూచించారు. మండలంలోని కలవచర్లలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఒసిఎల్‌) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సాయి కిషోర్‌ టీమ్‌ ఆధ్వర్యంలో బుధవారం ఆఫ్‌సైట్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో పారదీప్‌-హైదరాబాద్‌ పైప్‌ లైన్‌ మండలంలో 25 కిలోమీటర్లు పొడుగునా పోతుందన్నారు. ఈ పైప్‌ లైన్‌ ద్వారా పెట్రోల్‌, డీజిల్‌, ఏటిఎఫ్‌ ఆయిల్స్‌ను రవాణా చేస్తున్నారన్నారు. అంతకుముందు అరగంట పాటు ఐఒసిఎల్‌ అధికారులు వారి సిబ్బందితో మాక్‌ డ్రిల్‌ నిర్వహించి కళ్ళకద్దినట్టు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పైప్‌ లైన్‌ వెళ్లే మార్గంలో ఒకవేళ పైప్‌లైన్‌ లీకేజీ సంభవిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం అందజేస్తామని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. పైప్‌లైన్‌ వెళ్లే మార్గంలో భూమిపైన పైప్‌ లైన్‌ లీకేజీకి తలెత్తే బావులు తవ్వడం, బోర్లు తవ్వించడం, పంటలు పూర్తయ్యాక మంటలు పెట్టడం, దృఢమైన వృక్షాలు నాట్టడం లాంటివి చేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ యడ్ల గోపీనాయుడు, టిడిపి, జనసేన పార్టీల నాయకులు నీలిరోతు అప్పారావు, బెవర కూర్మారావు, చీపురుపల్లి ఫైర్‌ ఆఫీసర్‌ హేమసుందర్‌, పిహెచ్‌సి వైద్యాధికారి శ్రీధర్‌, ఐఒసిఎల్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సాయి కిషోర్‌, ఆపరేషనల్‌ ఎండ్‌ మైంటైనెన్స్‌ మేనేజర్‌, మెయిన్‌ లైన్‌ ఆఫీసర్‌ లక్ష్మి నారాయణరెడ్డి, పి. గణేష్‌ బాబులతో పాటు ఐఒసిఎల్‌ సిబ్బంది, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

➡️