ప్రజాశక్తి- శృంగవరపుకోట : ఆర్‌టిసిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా స్థానిక ఆర్‌టిసి డిపోలో సిఐ వి. నారాయణమూర్తి రహదారి భద్రతా వారోత్సవాలను గురువారం ప్రారంభించారు. డిపో మేనేజర్ కె.రమేష్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలు ఈనెల 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నెల రోజులు పాటు నిర్వహిస్తామని ప్రతిరోజు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుండి 21 తేదీ వరకు వరకు బస్సుల మెయింటనెన్స్, 22 నుండి 23 వరకు ప్రమాద రహిత డ్రైవర్లకు అలవెన్స్ పంపిణీ, 24వ తేదిన డ్రైవర్ల దినోత్సవం, 25 నుండి 28 వరకు శిక్షణ, 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు డ్రైవర్లకు వైద్య పరీక్షలు, 5, 6 తేదీలలో డ్రైవర్లకు ఫ్యామిలీ కౌన్సిలింగ్, 7 నుండి 10 వరకు రహదారి భద్రత పై అవగాహనా కార్యక్రమం, 11, 12 తేదీలలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. 13, 14 తేదీలలో ప్రమాదాల తనిఖీ, చివరిగా 15వ తేదీన డ్రైవర్లకు అవార్డుల ప్రదానంతో ముగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రతి రోజు డిపో సిబ్బందికి రహదారి భద్రత గురించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సిఐను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
