ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రూ.156.93 కోట్లతో విజయనగరం నగర బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. శనివారం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అధ్యక్షతన నగరపాలక సంస్థ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. నగర అభివృద్ధి పనులకు రూ.72.45 కోట్లు కేటాయించారు. రూ.10 కోట్ల సాధారణ నిధులతో కొత్తగా రోడ్లు వేసేందుకు, బిఎస్‌పి నిధులు రూ.2.50 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12 కోట్లతో అభివద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయంచారు. రూ.కోటితో సచివాలయాల పక్కా భవనాలు, రూ.కోటితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు, రూ.1.50 కోట్లతో హార్టికల్చర్, పట్టణ సుందరీకరణ, సాధారణ నిధులు రూ.5 కోట్లతో మురుగు కాలువలు, కల్వర్టుల నిర్మాణం, రూ.కోటితో సెంట్రల్ లైటింగ్, పార్కుల లైటింగ్, జంక్షన్ లైటింగ్, రూ.1.50 కోట్లతో పార్కులు, ఆట స్థలాల అభివృద్ధికి కేటాయింపులు చేశారు. రూ.2.50 కోట్లతో నీటి సరఫరా కోసం లైన్లు విస్తరణ, ఎన్‌సిఎపి నిధులు రూ.2 కోట్లతో కాలుష్య నివారణ పనులకు, రూ.2 కోట్లతో నగర పాలక సంస్థ ఆస్తుల రక్షణకు ప్రహరీల నిర్మాణానికి కేటాయించారు. ఈ బడ్జెట్‌ని స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. కొన్ని ఆదాయాలు పెంచే మార్గాలపై దిశానిర్దేశం చేసింది. ప్రధానంగా నగర పాలక సంస్థ భూములు, ట్రెడ్ లైసెన్సులు పెంచడం, ప్రకటనల ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని కమిటీ సభ్యులు ఎస్‌వివి రాజేష్, బాబు, అల్లు చాణక్య, రేగాన రూపావతి సూచించారు. కమిటీ సభ్యులు చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకుని తుది బడ్జెట్ రూపొందిస్తామని మేయర్ తెలిపారు. సమావేశంలో కమిషనర్ నల్లనయ్య, అసిస్టెంట్ కమిషనర్ తిరుమలరావు, అన్ని శాఖలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.