ప్రజాశక్తి- మెంటాడ : తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పించాలని సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రాకోటి రాములు, గిరిజన సంఘం మండల కార్యదర్శి టి.సోములు మాట్లాడుతూ కూనేరు పంచాయతీలోని ఎగువ మిర్తివలస, దిగువ మిర్తివలస, ఉద్దంగి పంచాయతీలోని కొత్తూరులో తాగునీరు, రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు. కలుషితమైన కొండవాగుల నీటిని తాగడంతో రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్తూరులో స్వచ్ఛంద సంస్థ మూడేళ్ల క్రితం బోరుబావి తీసిందని, దాని ద్వారా బురదనీరు రావడంతో ఇక్కడ గిరిజనులు వాగుల నీటినే వినియోగిస్తున్నారని చెప్పారు. తక్షణమే ఆయా గిరిజన గ్రామాలకు తాగునీరు, రహదారి సౌకర్యం కల్పించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపిపి రెడ్డి సన్యాసినాయుడు, ఎంపిడిఒ ఎం.భానుమూర్తికి వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు.