ప్రజాశక్తి – వేపాడ : సుమారు నెల రోజులుగా మండలంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు బుధవారంతో ముగిశాయి. ఆఖరి రోజు మండలంలోని కరకవలస పంచాయతీ పరిధిలో గల మారిక గిరిజన గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ముందుగా గ్రామంలో రెవెన్యూ సదస్సుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ జె.రాములమ్మ మాట్లాడుతూ రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి సుమారు 8 కిలోమీటర్లు నడిచి వచ్చి ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు న్యాయం చేయాలని ఉద్దేశ్యంతో సదస్సు పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఐ రామలక్ష్మి, మండల సర్వేయర్ గంగాధర్, ఎఎస్‌ఒ రాజు, గ్రామ రెవెన్యూ అధికారులు సత్యవతి, బాల భాస్కరరావు, పంచాయతీ కార్యదర్శి సచివాలయ సర్వేయరు తదితరులు పాల్గొన్నారు.అక్రమాలపై చర్యలు తీసుకోండిరెవెన్యూ అక్రమాలపై చర్యలు చేపట్టి గిరిజన రైతులకు న్యాయం చేయాలని సిపిఎం నాయకులు చల్లా జగన్ అధికారులను కోరారు. మారిక గిరిజన భూముల్లో దేవరపల్లి మండలం చింతలపూడి గ్రామానికి చెందిన మహిళచే ఒక కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి గిరిజనలకు వారి భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. సుమారు 50 ఎకరాల గిరిజనుల భూమిని పాసు పుస్తకాలు చేస్తామని నమ్మిఇంచి వేరే ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం దుర్మార్గమన్నారు. ఆయన వెంట గిరిజన నాయకులు వీర్రాజు, సోమేశ్, బాబురావు, అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.