ప్రజాశక్తి-బొబ్బిలి: విజయనగరం కలెక్టరేట్ వద్ద ఈనెల 12న జరగనున్న యువత పోరును జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కోరారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో సోమవారం యువత పోరు పోస్టర్లను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే సుపర్ సిక్స్ అమలు చేస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లేదంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు కోసం డిమాండ్ చేయడంతో కట్టలేక అవస్థలు పడుతున్నారన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు యువత పోరును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, నాయకులు శంబంగి వేణుగోపాలనాయుడు, తూముల భాస్కరరావు, బి.సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జి.రమాదేవి పాల్గొన్నారు.
