మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర

Apr 13,2025 21:35

ప్రజాశక్తి – విజయనగరం కోట:  టిటిడి గోవు మరణాలపై భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నారని ఎపి మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల టిడిపి ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. స్థానిక అశోక్‌ బంగ్లాలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టిటిడిపై భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ కరుణాకర్‌ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమన్నారు. ఈ సమావేశంలో భోగాపురం టిడిపి మండల అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పలనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొత్తవలస: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా పనిచేసిన కాలంలో అనేక కుంభకోణాలకు పాల్పడిన భూమన కరుణాకర్‌ రెడ్డి గతంలో స్వామివారి ఉనికినే ప్రశ్నించారని, అటువంటి నాస్తికుడు ఇప్పుడు ఫేక్‌ ఫోటోలు పెట్టుకుని గోమాతలపై విషప్రచారం చేస్తున్నారని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఆదివారం స్థానిక టిడిపి కార్యాలయంలో నాయకులతో కలిసి ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భూమన కరుణాకర్‌ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని, టిటిడి ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో విశాఖ బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు బొబ్బిలి అప్పారావు, మాజీ జెడ్‌పిటిసి కోళ్ల శ్రీను, క్లస్టర్‌ ఇంచార్జ్‌ రత్నాజీ, గొంప దుర్గా ఉమేష్‌, కోరుపోలు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి: టిటిడి గోవు మరణాలపై భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర అని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టిటిడిపై భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ కరుణాకరరెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. గోశాలలను సందర్శించిన భక్తులు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తుంటే, ఇక్కడ పరిశుభ్రత లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను నాస్తికుడినని స్వయంగా కరుణాకరరెడ్డి ప్రకటించుకున్న విషయం వాస్తవం కాదా? వెంకటేశ్వరస్వామిదే ముంది ఒక నల్ల రాయి, దానిని పెకిలించేస్తానంటూ గతంలో మాట్లాడలేదా.? అని ప్రశ్నించారు.చీపురుపల్లి: టిటిడి గోశాలపై భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపణలు అర్థరహితం, నిరాధారమని ఎమ్మెల్యే కళా వెంకటరావు అన్నారు. తప్పుడు ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నదే వైసిపి కుట్ర, అందులో భాగంగానే వైసిపి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి టిటిడి గోశాలపై నిరాదార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎక్కడో వేరే ప్రాంతంలో చనిపోయిన గోవుల ఫోటో చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

➡️