ప్రజాశక్తి-శృంగవరపుకోట : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విధ్వంసానికి కుట్ర చేస్తోందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ ధ్వజమెత్తారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను శృంగవరపుకోట పట్టణంలో కెవిపిఎస్ ఆధ్వర్యాన సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎస్‌సి కాలనీ నుంచి వన్‌వే జంక్షన్, గాంధీ బొమ్మ, ఆర్‌టిసి కాంప్లెక్స్ మీదుగా దేవి కూడలి వరకు తీన్మార్, డిజె, మందుగుండు సామగ్రితో భారీ ర్యాలీ చేపట్టారు. మనువాదుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, లౌకికవాదాన్ని పరిరక్షించుకుందాం, మనువాద సిద్ధాంతాన్ని వ్యతిరేకించండి, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం, ఎస్‌సి, ఎస్‌టిలకు రక్షణగా ఉన్న చట్టాలను కాపాడుకుందాం.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం దేవి కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంపై, రాజ్యాంగ హక్కులపై దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్యాంగమే భారతదేశానికి ప్రథమ గ్రంథమని స్పష్టంచేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అందరం పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు మద్దిల రమణ, శృంగవరపుకోట మేజర్ పంచాయతీ సర్పంచ్ గనివాడ సంతోషికుమారి, దళిత నాయకులు జైశంకర్, మామిడి శంకర్, గంట శంకర్, గణేష్, ఆర్మీ గణేష్, భారతి, ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడు కోవడమే నివాళి
విజయనగరంటౌన్ : ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని కెవిపిఎస్, ఐద్వా జిల్లా కార్యదర్శులు అర్.ఆనంద్, పి.రమణమ్మ అన్నారు. సోమవారం విజయనగరం గంజిపేటలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… కేంద్రం లో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని అన్నారు. దేశంలో బిజెపి కులాన్ని,మతాన్ని తన స్వార్థ రాజకీయాలకు వాడుకుంటుందని విమర్శించారు. ఒక ప్రక్క అంబేద్కర్ పై తీపి కబురులు చెబుతూ ఆయన రాసిన రాజ్యాంగంపైన, దళితులు,మహిళలు,మైనార్టీలు పైన దాడులు చేస్తుందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు కోసం పని చేసినప్పుడు,రాజ్యాంగాన్ని కాపాడినప్పుడు ఆయనకు నిజమైన నివాళి ఇచ్చిన వారం అవుతామని అన్నారు. కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు వెంకటరావు, పట్టణపౌర సంక్షేమ సంఘం నాయకులు రంభ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వైయస్సార్ నగర్, స్టేడియం పేట, గాజుల రేగలో ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని కాపాడు కుంటామని ప్రతిజ్ఞ చేశారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.జగన్మోహన్రావు, బి భాస్కరరావు, మహిళా నాయకుల కుమారి, రమ మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి.రాము, ఆటో యూనియన్ నాయకులు బి పాపారావు, మున్సిపల్ యూనియన్ నాయకులు బి.కృష్ణ, డి. వైకుంఠ రాజు, బి. మోహన్ పాల్గొన్నారు.
సిపిఎం ఆధ్వర్యాన నివాళి
అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీ బిజెపి పాలనలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని అన్నారు. ప్రజలంతా ఐక్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి. రమణమ్మ. జగన్మోహన్. కె.సురేష్, నగర కమిటీ సభ్యులు రాము, కరుణ, రంభ శ్రీనివాస్, వి.రామ చంద్రరావు, హరీష్ పాల్గొన్నారు.
నెల్లిమర్ల : మండలంలోని రామతీర్థం జంక్షన్‌లో అంబేద్కర్ విగ్రహానికి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టివి రమణ పూలమాల వేసి నివాళులర్పించారు. జరజాపుపేటలోని ఎస్‌సి కాలనీలో అంబేద్కర్ చిత్రపటానికి సిపిఎం నాయకులు కిల్లంపల్లి రామారావు ఆధ్వర్యాన పూలమాల వేసి నివాళులర్పించారు.
బొబ్బిలి : పట్టణంలోని పాకివీధిలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ ఎస్.గోపాలం, నాయకులు జి.శంకర్రావు, జి.గౌరి, ఆదయ్య, తదితరులు పాల్గొన్నారు.
యుటిఎఫ్ ఆధ్వర్యాన.. టి.పి.మున్సిపల్ పాఠశాలలో యుటిఎఫ్ మండల గౌరవాధ్యక్షులు నాగూరు రమేష్ అధ్యక్షతన రాజ్యాంగ హక్కులు రక్షణ… విద్యారంగంపై సదస్సు నిర్వహించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సదస్సులో యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు విజయగౌరి మాట్లాడుతూ రాజ్యాంగం అతి పెద్ద ప్రమాదంలో పడబోతోందని, రాజ్యాంగ మౌలిక సూత్రాలను కాలరాసే చట్టాలు, చర్యలు తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అందులో జాతీయ నూతన విద్యా విధానం ఒకటని చెప్పారు. దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మీసాల గౌరు నాయుడు అంబేద్కర్‌పై రచించిన గేయాన్ని పాడి వినిపించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు ప్రసన్నకుమార్, నాయకులు పి.మధుసూధనరావు, కేశవరావు, ఆనెం శ్రీనివాస్, సత్యనారాయణ, చిట్టిబాబు, బత్తుల శ్రీనివాస్, వరప్రసాద్, రమేష్, సుధాకర్, ప్రసాద్, రామకృష్ణ, గౌరునాయుడు పాల్గొన్నారు.
కొత్తవలస : ఉత్తరాపల్లి పంచాయతీ గాంధీనగర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి జి.అప్పారావు, వ్యవసాయ కార్మికులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
