మార్చిలోగా ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలి

Sep 28,2024 21:04

ప్రజాశక్తి – నెల్లిమర్ల: ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు నిర్మాణం వచ్చే మార్చి లోగా పూర్తి చేయాలని గృహా నిర్మాణ సంస్థ పీడీ కూర్మి నాయుడు అన్నారు. శనివారం జరజాపు పేటలో ‘మన ఇళ్లు మన గౌరవం’ కార్యక్రమంలో భాగంగా హౌసింగ్‌ పీడీ ఇంటి నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదార్లతో సమావేశం నిర్వహిం చారు. ఆయన మాట్లడుతూ ఇంతవరకు నిర్మాణ దశలో ఉన్న 80ఇళ్లు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలన్నారు. నిర్మాణం పూర్తి చేయకపోతే రద్దయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ సముద్రపు రామారావు, మేనేజర్‌ టివిఎస్‌ విశ్వేశ్వర రావు, హౌసింగ్‌ ఇఇ శ్రీనివాస్‌, డిఇ మురళీ మోహన్‌, ఎఇ ఆర్‌.పవన్‌ పాల్గొన్నారు.చీపురుపల్లి: ప్రభుత్వం మంజూరి చేసిన ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఎంపిడిఒ కె.రామకృష్ణరాజు అధికారులను కోరారు. శనివారం స్థానిక మండలపరిషత్‌ కార్యాలయం ఆవరణలో హౌసింగ్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మన ఇల్లు మన గౌరవం’ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు మంజూరై మద్యలో నిలిచిపోయిన ఇల్లు గాని, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఇల్లు గాని త్వరితగతిని పూర్తి చేసేందుకు లబ్దిదారులను చైతన్యం చేయాలన్నారు. వివిధ దశలలో ఉన్న ఇల్లను 25 సెప్టెంబర్‌ 2025 లోపు పూర్తి చేసే విధంగా చూడాలని సూచించారు. వేపాడ: మండలంలోని ఎన్‌కెఆర్‌పురం సచివాలయం వద్ద ‘మన ఇల్లు మన గౌరవం’ కార్యక్రమంపై శనివారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమ ప్రత్యేకాధికారి ఎఒ యశ్వంత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గృహ నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు మంజూరైన గృహల నిర్మాణం పనులు వేగవంతం చేసుకోవాలన్నారు. సమావేశంలో సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ శ్వేత, టిడిపి నాయకులు పాల్గొన్నారు.రాజాం: మండలంలోని బొద్దాంలో శనివారం ‘మన ఇల్లు మన గౌరవం’ కార్యక్రమంపై సచివాలయంలో అవగామన కల్పించారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న పక్కా ఇళ్ల నిర్మానులను లబ్ధిదారులు తర్వితగతిన పూర్తిచేయాలని నోడల్‌ అధికారి నిర్మల కుమారి ఆదేశించారు. మధ్యలోనే ఆగిపోవడానికి గల కారణాలు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలు కల్పన, ఇసుక కొరత, బిల్లులు పెండింగ్‌, వంటి కారణాలవల్ల ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయినట్లు లబ్ధిదారులు మొరపెట్టుకు న్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయినంతవరకు బిల్లులు చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

➡️