ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు గుర్తింపుపై టిడిపి, వైసిపి కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైసిపి కౌన్సిలర్ ఇంటి గోవిందరావు మాట్లాడుతూ కౌన్సిల్ ఆమోదానికి పెట్టిన అభివృద్ధి పనులను ఏ ప్రాతిపదికన గుర్తించారని ప్రశ్నించారు. టిడిపి వార్డులకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. దీనిపై స్పందించిన టిడిపి కౌన్సిలర్ వైసిపి ప్రభుత్వం హయాంలో ఏకపక్షంగా వైసిపి వార్డులకు నిధులు కేటాయించారని, టిడిపి హయాంలో అన్ని వార్డులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పడంతో ఇరు పార్టీల కౌన్సిలర్లు మధ్య వాగ్వి వాదం చోటుచేసుకుంది. రాజా కళాశాల రోడ్డులో కాలువలు కట్టకుండా రోడ్లు వేయడంతో రోడ్లు పాడైపోతున్నాయని టిడిపి కౌన్సిలర్ రాంబార్కి శరత్ అన్నారు. అత్యవసరం లేని పనులకు ముందస్తు అనుమతులు ఎందుకు తీసుకోవాల్సి వస్తుందని, అత్యవసర పనులకు మాత్రమే ముందస్తు అనుమతులు తీసుకోవాలని శరత్ కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ చెలికాని మురళి మాట్లాడుతూ కరెంట్ ఆఫీసు నుంచి ఇందిరమ్మ కాలనీ వరకు రోడ్డు పక్కన వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జి.రమాదేవి మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు ఆక్రమ ణలను తొలగించాలని కోరారు. కాలువలపై నిర్మాణాలు చేయడంతో పాటు షాపులు పెట్టడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. గొల్లవీధి రోడ్డు ఆక్రమ ణకు గురైందని చెప్పారు. టిడిపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గెంబలి శ్రీనివాసరావు మాట్లా డుతూ మార్కెట్ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించేందుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. మేదరబంద జంక్షన్ వద్ద ఉన్న నుయ్యిపై ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ షాపు అద్దె చెల్లించేందుకు మున్సిపల్ ఆఫీసుకు వస్తే ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మేదరబంద షాపుల యజమానులు రోడ్డును ఆక్రమిస్తున్నారని, తొలగించాలన్నారు. తమ వార్డు అభివద్ధికి నిధులు మంజూరు చేయడం లేదని 14వ వార్డు కౌన్సిలర్ ఎస్.లక్ష్మి అనగా నిధులు మంజూరు చేస్తామని చైర్మన్ మురళీకృష్ణ హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించాలని వైసిపి కౌన్సిలర్ చోడిగంజి రమేష్ నాయుడు కోరారు. పలు అభివృద్ధి పనులకు ఏకగ్రీవంగా ఆమోదించారు. కౌన్సిల్ సమావేశంలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని చైర్మన్ మురళి, కమిషనర్ రామలక్ష్మి హామీ ఇచ్చారు. సమావేశంలో అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కౌన్సిలర్లంటే గౌరవం లేదా..?
నెల్లిమర్ల: నగర పంచాయతీలో కౌన్సిలర్లంటే గౌరవం లేదా అని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు. శనివారం స్థానిక నగరపంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశంలో కౌన్సిలర్లు కాకుండా వేరే వారు ఉండడంతో అసలైన కౌన్సిల్ సభ్యులకు సీట్లు లేకుండా పోయాయి. దీంతో పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్లు మైపాడ ప్రసాద్, మొయిద శ్రీను, చిక్కాల సుమతి, పైల భారతి మాట్లాడుతూ కౌన్సిలర్లు కాని వారు సమావేశానికి ఎలా అనుమతిస్తారని, అసలు కౌన్సిలర్లకు కనీసం సీటు కూడా ఏర్పాటు చేయక పోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార్లు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లకు కనీసం సమాచారం ఇవ్వకుండా కుళాయి కనెక్సన్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. దీనిపై టిడిపి నాయకులు లెంక అప్పలనాయుడు అభ్యంతరం వ్యక్తం చేసి వైసిపీ పాలనలో ఇలానే ప్రశ్నించారా అని అడగడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వవాదంతో చర్చ జరగకుండారాసాభాసగా మారింది.