డెయిరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Feb 3,2025 21:42

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విశాఖ డెయిరీ ఆస్తులను లూటీ చేస్తూ ఆవు పాల సేకరణ ధర తగ్గించి, ధరలో కోత పెట్టిన విశాఖ పాల డెయిరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎపి పాల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రాంబాబు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద పాల రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ విశాఖ డెయిరీ యాజమాన్యం ఆవు పాలు సేకరణ 10శాతం తగ్గించిందన్నారు. అంతకుమునుపే నవంబర్‌లో సేకరణ ధర లీటరుకు రూ.4 తగ్గించారని, ఇలా వరుస పెట్టి పాల రైతులను కష్టపెట్టి, నష్టపరుస్తూ రైతులను నిండా ముంచుతున్నారన్నారు. పెరిగిన పశు పోషణ ఖర్చుల భారం రైతు భరిస్తూ సెంటరుకు పాలు పోస్తున్న రైతులకు న్యాయమైన ధర అందించవలసిన బాధ్యతను విస్మరించి డెయిరీ యాజమాన్యం సహకార రంగం స్ఫూర్తికి భిన్నంగా నడుస్తోందన్నారు. విశాఖ డెయిరీ నేడు స్వార్ధపరుల అక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. సుదీర్ఘకాలం డెయిరీ యాజమాన్యం బాధ్యతలలో ఉన్న ఆడారి కుటుంబం తనకు ఉన్న మంది బలంతో సహకార రంగాన్ని వీడి కంపెనీ చట్టంలోకి డెయిరీని మార్చుకున్నారన్నారు. దీంతో ప్రభుత్వం పర్యవేక్షణ నుండి తప్పించుకొని అవినీతి, అక్రమాలకు శ్రీకారం చుట్టి డెయిరీ ఆస్తులను లూటీ చేస్తున్నారని అన్నారు. హైదరాబాదులో ఉన్న సొంత డెయిరీకి విశాఖ డెయిరీ నుంచి పాలు, నిధులు మళ్లించి రైతులకు మాత్రం నష్టాలు మిగుల్చుతున్నారని అన్నారు. ప్రభుత్వం విశాఖ డెయిరీపై వేసిన కమిటీ విచారణను వేగవంతం చేసి దోషులను శిక్షించాలని, డెయిరీ ఆస్తులను కాపాడాలని అన్నారు. డెయిరీని కంపెనీ చట్టం నుండి సహకార చట్టంలోకి మార్చాలని డిమాండ్‌ చేశారు. ఆవుపాల సేకరణ ధర పెంచాలని, ఏడాదికి మూడుసార్లు బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఎఒకు వినతినిచ్చారు. ధర్నాలో పాల రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు లోకవరవు అది నారాయణ మూర్తి, జిల్లా కార్యదర్శి గొంప కృష్ణమూర్తి, కౌలురైతుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.పైడపునాయుడు, రాకోటి రాములు, జామి మాజీ జెడ్‌పిటిసి బండారుపెదబాబు, బోదంకి సన్యాసిరావు, వసంత సర్పంచ్‌ సత్యం, మాజీ సర్పంచ్‌ గంగు నాయుడు, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌ గోపాలం, బుగత సునీల్‌, సురీడేముడు, బంగారు నాయుడు, రవి రాజు, కోటేశ్వర రావు, పెంటయ్య, వసంత ఎంపిటిసి నారాయణ పాల్గొన్నారు.

➡️