డిఇఒ కార్యాలయం వద్దఎండిఎం కార్మికుల ధర్నా

Nov 29,2024 21:46

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రమాద బీమా, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సంఘం ఆధ్వర్యాన శుక్రవారం డిఇఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి మాట్లాడుతూ వందలాది మంది విద్యార్థులకు ఆహారం వండి పెడుతున్న ఎండిఎం కార్మికులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. ప్రమాదాలు జరిగిన సందర్భంలో విద్యా శాఖ అధికారులు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదన్నారు. అందుకు గురువారం కంటోన్మెంట్‌ మున్సిపల్‌ హైస్కూల్లో జరిగిన సంఘటనే నిదర్శనమన్నారు. వంట చేస్తుండగా అగ్నిప్రమాదం సంభవించి ఇద్దరికి కాలిన గాయాలైనట్లు చెప్పారు. కార్మికురాలు స్వప్నకు ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడినట్లు ఆందోళన వ్యక్తంచేశారు. అయినా ఇప్పటివరకు ఆమెను పరామర్శ కోసం కూడా పాఠశాల సిబ్బంది గానీ, విద్యా శాఖ అధికారులు గానీ వెళ్లలేదని చెప్పారు. వెంటనే స్వప్నకు నష్టపరిహారం చెల్లించాలని, ఆమె పూర్తిగా కోలుకునే వరకూ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌చేశారు. ఎండిఎం కార్మికులకు ప్రమాద బీమా, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, ఏడాదికి మూడు కాటన్‌ దుస్తులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటి డిఇఒకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహనరావు, మధ్యాహ్న భోజన యూనియన్‌ నాయకులు లక్ష్మి, సాయి, నారాయణమ్మ, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

➡️