ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రి భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ నెల 24న రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని ఎపి బిల్డింగ్ అండ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అర్‌వి నర్సింహారావు తెలిపారు. సోమవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని చెప్పి, అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమబోర్డును పురుద్ధరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు పది నెలలు కావస్తున్నా సంక్షేమ బోర్డు పునరుద్ధరించకపోవడం అన్యాయమన్నారు. సంక్షేమ బోర్డులో రూ.4293 కోట్లు నిధులు ఉన్నాయని, ఆ నిధులతో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. వెంటనే సంక్షేమ బోర్డును పురుద్ధరించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి.రమణ, నాయకులు బి.సత్యం, కె.సంతోష్ కుమార్, అర్.సతీష్ పాల్గొన్నారు.
