ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈనెల 17 నుండి 20 వరకు చెన్నైలో జరుగబోయే 23వ పారా జాతీయ స్థాయి ఛాంపియన్ షిప్ పోటీలకు ఆదివారం నాడు జిల్లా నుండి బయలుదేరిన క్రీడాకారులకు పారా జిల్లా గౌరవ అధ్యక్షులు కె. దయానంద్ అల్ ద బెస్ట్ తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 2న గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన పారా రాష్ట్ర స్థాయి పోటిల్లో జిల్లాకు చెందిన సుంకరి దినేష్, దొగ్గా దేముడు నాయుడు, బోధల వాసంతి, కిల్లాక లలితలు పరుగు 100మీటర్లు, 400 మీటర్లు, షాట్ పుట్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలలోనూ రాణించి ప్రతీ ఒక్కరూ పతకాలను సాధించాలని, తద్వారా జిల్లా ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆకాంక్షించారు.
