‘ర్యాపిడో’ను అనుమతించొద్దు

Feb 3,2025 21:45

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల పొట్ట కొట్టే కార్పొరేట్‌ సంస్థ ర్యాపిడోకు రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు, జనాభా రద్దీగా ఉన్న కూడళ్లలో ఇచ్చే అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకనక దుర్గా ఆటో వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన స్థానిక కోట జంక్షన్‌ వద్ద ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ కో కన్వీనర్‌ ఎ.జగన్మోహన్‌ రావు, ఆటో యూనియన్‌ నాయకులు బి. పాపారావు, రామునాయుడు మాట్లాడుతూ ఇప్పటికే సరిగా బేరాలు లేక ఇబ్బంది పడుతున్నామని, ర్యాపిడోను అనుమతిస్తే ఉపాధికి తీవ్ర నష్టం జరుగుతుందని అందువల్ల ర్యాపిడోకు విజయనగరంలో అనుమతులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేరళ తరహాలో (సవారి యాప్‌ ) ప్రభుత్వమే యాప్‌ ను నిర్వహించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంపై మన రాష్ట్ర ఎంపిలు ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. విజయనగరంలో ఆటోలకు పార్కింగ్‌ స్థలాలు కేటాయించక పోవడంతో రాంగ్‌ పార్కింగ్‌ పేరుతో వేలాది రూపాయలు ఫైన్‌ లు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా రంగ కార్మికులను ఒక పరిశ్రమగా గుర్తించి వారి ఉపాధి భద్రతకు, భరోసా కల్పించేందుకు బడ్జెట్లో కేటాయింపులతో పాటు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మార్చి 24న చలో పార్లమెంట్‌కు ఆటో, రవాణా రంగ కార్మికులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆటో, క్యాబ్‌ యూనియన్‌ నాయకులు , డ్రైవర్లు పాల్గొన్నారు. ఎఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో ధర్నా ర్యాపిడో బైక్స్‌, ఓలా, ఓబర్‌ వంటి కంపెనీలకు రైల్వే స్టేషన్‌ లు, బస్టాండు వద్ద లైసెన్స్‌ లు ఇవ్వడాన్ని విరమించుకోవాలని శ్రీ విజయ దుర్గ ఆటో యూనియన్‌ (ఎఐఎఫ్‌టియు) ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు బెహరా శంకరరావు, రెడ్డినారాయణరావు, అప్పలరాజు మాట్లాడారు. జిల్లాలో జ్యూట్‌ మిల్లులు మూతపడడంతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లేక స్వయం ఉపాధిగా ఆటో రంగాన్ని ఎంచుకొని, పైనాన్సులు లేక ప్రవేటు వ్యక్తులు వద్ద నుండి అప్పులు చేసి ఆటోల నడుపుకుంటున్నారని, వారి పొట్టకొట్టేలా ఓలా, ఓబర్‌, రాపిడ్‌ బైక్‌లకు అనుమతులు ఇవ్వడం అన్యాయమని అన్నారు.

➡️