అగ్రహారానికి మోక్షం కలిగేనా?

Jun 9,2024 21:51

ప్రజాశక్తి – జామి : అగ్రహారానికి మోక్షం కలిగేనా? గత పాలకులు చేపట్టిన నోటిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేనా? అంటే అవుననే ఆశలు రైతుల్లో కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి కోళ్ల లలితకుమారి అగ్రహారం భూముల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికవడం, కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో అగ్రహారం భూముల సమస్యపై ప్రత్యేక దృష్టిసారిస్తారని రైతాంగం భావిస్తోంది. ఇదే జరిగితే, తాతల తండ్రుల నాటి సమస్యకు స్వస్తి పలికే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే జామి మండల కేంద్రంలోని వేలాది మంది రైతులు ఎమ్మెల్యే కోళ్లపై ఆశలు పెట్టుకున్నారు.తాతలు తండ్రుల కాలం నుంచి భూములకు హక్కులు లేకుండా అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. పాలకులు మారుతున్నారు తప్ప… అగ్రహార భూముల సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది మే 25 తేదీన భూములకు అప్పటి తహశీల్దార్‌ పబ్లిక్‌ నోటిఫికేషన్‌ వేసి అన్నదాతల్లో ఆశలు రేపారు. తాత ముత్తాతల కాలం నుంచి సాగుచేస్తున్న భూములను ఇనాం వాటా కింద 1/3 షేర్‌ కేటాయించిన అధికారులపై మండిపడినా, ఇప్పటికైనా భూసమస్య పరిష్కారానికి నోచుకుంటుందని ఆశ పడ్డారు. నోటిఫికేషన్‌లోని ఉన్న అనేక తప్పులు తడకలు ఉన్నప్పటికీ సమస్య పరిష్కారం కోసం ప్రశ్నించకుండా అధికారులకు సహకరించాలని భావించారు. తమ భూములపై అభ్యంతరాలను అధికారుల సూచనల మేరకు అందజేశారు. ఈ పక్రియ జరిగి సుమారుగా ఏడాది కావస్తున్నా… అగ్రహారంపై ఎటువంటి అడుగులూ ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు రావడం, టిడిపి కూటమి ఘన విజయం సాధించడంతో ఈసారైనా సమస్య పరిష్కారం అవుతుందని రైతులు గంపెడు ఆశలు పెట్టుకుంటున్నారు.చొరవ చూపిస్తే… సాధ్యమే జామి మండల కేంద్రంలో సుమారుగా 2600 ఎకరాల వరకు ఇనాం భూములు (అగ్రహారం) కింద ఉన్నాయి. వీటికి హక్కులు కల్పించాలని రైతుల ఏళ్ల నాటి కల. 2009లో భూ సర్వే ప్రారంభమైతే, గత ఏడాది 25 తేదీన అప్పటి తహశీల్దార్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 30 రోజుల్లో నోటీసులో పొందుపర్చిన వివరాలపై అభ్యంతరాలు తెలపాలని పేర్కొన్నారు. ప్రధానంగా నోటిఫికేషన్‌లో ఇనాందారుని పేరు రాయకుండానే ఇనాం వాటా కింద 1/3 భూమిని కేటాయించడం గందరగోళాన్ని సృష్టించింది. దీంతో ప్రతి రైతూ అభ్యంతరం తెలపాల్సిన పరిస్థితి దాపురించింది. నూటికి నూరు శాతం రైతులు అభ్యంతరాలు తెలిపారు. ఇది జరిగి ఏడాది కావస్తున్నా… ప్రక్రియ ముందుకు సాగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో టిడిపి అభ్యర్థి కోళ్ల లలితకుమారి అగ్రహార భూ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.. ఈ నేపథ్యంలోనే నూతన ప్రభుత్వంపై రైతులు ఆశలు పెట్టుకున్నారు.

➡️