గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలి

Feb 3,2025 19:45

ప్రజాశకి-విజయనగరం టౌన్‌ : మెంటాడ మండలంలోని గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి టి.సోములు డిమాండ్‌ చేశారు. సోమవారం ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో ఖాలీ బిందెలతో కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెంటాడ మండలంలోని ఆండ్ర, లోతు గెడ్డ గ్రామాల్లో గిరిజనులు నివాసం ఉన్న చోట మంచినీటి కుళాయిలు లేకపోవడంతో వేసవిలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూనేరు పంచాయితీలోని ఎగువగుడ్డివలస, దిగువగుడ్డివలస గ్రామాల్లోను, కొండలింగాల వలస పంచాయతీ శీరవలస, సరవిల్లి గ్రామాల్లోను, ఆగూరు పంచాయతీ సంఘంగుడ్డివలస, కిందగూడెం గ్రామాలు, ఆండ్ర పంచాయతీ వేపగుంట వలస, కుంబివలస, కొండజీరికి వలస గ్రామాల్లోను తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. గిరిజనులు ఎక్కడో కొండ పైన ఊటనీరు, గెడ్డనీరు తాగుతున్నారని, దీంతో అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. గిరిజన గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు రోడ్లు వేసి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.ధర్నా లో వి.రాములు,హరికష్ణ, వి.లక్ష్మి,రామారావు, బలరాం గిరిజనులు పాల్గొన్నారు.

➡️