ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

Jan 11,2025 20:36

ప్రజాశక్తి-గజపతినగరం : తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉత్తరాంధ్ర పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కె.విజయగౌరి తెలిపారు. శనివారం స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. యుటిఎఫ్‌తోపాటు మరికొన్ని సంఘాల మద్దతుతో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్‌ తరఫున బరిలో నిలిచినట్లు తెలిపారు. మొదట ప్రాధాన్యత ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. కెజిబివి టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు చాలావరకు పరిష్కరించామన్నారు. ఎంటిఎస్‌, హెచ్‌ఆర్‌ సాధనే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మోడల్‌ స్కూల్‌ టీచర్ల సర్వీస్‌ రూల్స్‌ అమలు, కారుణ్య నియమాల కోసం కృషి చేస్తానన్నారు. కాలేజీ కాంట్రాక్టు, గెస్ట్‌ లెక్చరర్లు సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని, వాటిపై చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ టీచర్ల, లెక్చరర్ల న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, కోశాధికారి సిహెచ్‌.భాస్కరరావు, కార్యదర్శి అల్లు శంకర్రావు, సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి అప్పారావు, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ రాంప్రసాద్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు బి.కాంతారావు, గజపతినగరం, దత్తిరాజేరు, మెంటాడ మండలాల నాయకులు పాల్గొన్నారు.

➡️