విద్యుత్‌ సమస్యలను పరిష్కరించుకోవాలి

Apr 16,2025 21:02

ప్రజాశక్తి- గంట్యాడ : విద్యుత్‌ వినియోగదారులు తమ సమస్యలను సిజిఆర్‌ఎఫ్‌ ద్వారా పరిష్కారం చేసుకోవాలని కన్సూమర్‌ గ్రీవెన్స్‌ ఫోరం చైర్మన్‌ బి.సత్యనారాయణ అన్నారు. బుధవారం గంట్యాడ విద్యుత్తు కేంద్రం వద్ద జరిగిన సిజిఆర్‌ఎఫ్‌ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వినియోగదారుల సమస్యలు పరిష్కారం కోసం వినతి పత్రాలను స్వీకరించారు. ఎటువంటి ఖర్చూ లేకుండా వినియోగదారుల సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. తమ సమస్యలను 1912 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా, పోస్టల్‌ ద్వారా విశాఖపట్నంలో ఉన్న ఎపిఇపిడిసిఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయానికి పంపించాలన్నారు. సరఫరాలో అంతరాయాలు, కాలిపోయిన మీటర్‌, ఓల్టేజ్‌లో హెచ్చు తగ్గులు, సర్వీసు లోపాలు, కనెక్షన్‌ మార్పు, కొత్త కనెక్షన్‌ జారీలో ఆలస్యం, రీ కనెక్షన్‌ సమస్యలలో తప్పులను 60 రోజుల్లో పరిష్కారం చేస్తామన్నారు. సమస్యను పరిష్కరించడానికి సిబ్బందినే ఇంటికి పంపిస్తామన్నారు. శ్రీకాకుళము నుంచి ఏలూరు వరకు 11 జిల్లాల్లో ఈ వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఇప్పటి వరకూ 8,679 కేసులు వచ్చాయని వీటిలో 8,508 కేసులను పరిష్కరించామని చెప్పారు. 171 కేసులు పరిష్కారం చేయవలసి ఉందన్నారు. సమస్య ఏర్పడినప్పుడు నుంచి వినియోగదారుడు తమ సమస్యలను రెండు సంవత్సరాల లోపు తమకు తెలియజేస్తే సమస్య పరిష్కారం చేస్తామన్నారు. 2023లో 536 కేసులు 2024లో 567 కేసులు వచ్చాయని వాటిని పరిష్కరించామని చెప్పారు. 2025లో 350 కేసులు వచ్చాయని వీటిలో 170 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. వివిధ రూపాలలో 108 కేసులకు రూ.14,36,950 నష్ట పరిహారం చెల్లించామని చెప్పారు. వివిధ ప్రమాదాలలో చనిపోయిన వారికి లక్షల రూపాయలు చెల్లిస్తారని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి వర్గీయులకు 200 యూనిట్ల విద్యుత్తును, రైతులకు తొమ్మిది గంటల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నామన్నారు. గంట్యాడ మండల పరిధిలో ఐదు ఫిర్యాదులు వచ్చాయని ఒక ఫిర్యాదును పూర్తి చేశామని చెప్పారు. అనంతరం జూనియర్‌ కళాశాల విద్యార్థులకు సిజిఆర్‌ఎఫ్‌ పై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి దీనిపైన వినియోగదారులకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.సత్యనారాయణ, సుబ్బారావు, తహశీల్దార్‌ నీలకంఠేశ్వర్‌రెడ్డి, కళాశాల ప్రధానోపాధ్యాయులు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

➡️