ఆకతాయిల భరతం పట్టేందుకు శక్తి టీం

Mar 13,2025 20:47

ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లాలో మహిళలపై దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు శక్తి బృందాలను నియమించామని ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన శక్తి బృందాలతో ఎస్‌పి.. పోలీసు కార్యాలయంలో మమేకమై, వారు నిర్వర్తించే విధులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. శక్తి బృందాలు జిల్లాలోని కళాశాలలు, ముఖ్య కూడళ్లను మఫ్టీలో సందర్శించి, మహిళలను వేధించే ఆకతాయిలను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు చేపడతాయని చెప్పారు. జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, రాజాం పట్టణాలలో ఆరుగురు పోలీసు సిబ్బందితో ఐదు బృందాలను ఏర్పాటుచేశామని తెలిపారు. ఒక్కొక్క బృందానికి ఎస్‌ఐ నాయకత్వం వహిస్తారన్నారు. ఈ బృందాలు మఫ్టీలో విధులు నిర్వహిస్తాయని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్‌ కోసం గతంలో ప్రత్యేకంగా కేటాయించిన ద్విచక్ర వాహనాలను, ఫోర్‌ వీలర్లను, పెట్రోలింగ్‌ వాహనాలను వినియోగించాలన్నారు. ఆపద సమయంలో శక్తి యాప్‌కు వచ్చే ఎస్‌ఒఎస్‌ కాల్స్‌, డయల్‌ 112/100 కాల్స్‌తో సంఘటన స్థలానికి ట్యాబ్‌లను కూడా తీసుకెళ్లాలని, బాడీ వార్న్‌ కెమెరాలను ధరించాలని సూచించారు. మహిళలకు రక్షణగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్‌ యాప్‌ పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ఈ బృందాల పని తీరును జిల్లాలో ఎఎస్‌పి పి.సౌమ్యలత పర్యవేక్షిస్తారని, మహిళా పిఎస్‌ ఇన్‌స్పెక్టరు నోడల్‌ అధికారిగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎఎస్‌పి పి.సౌమ్యలత, మహిళా పిఎస్‌ సిఐ ఇ.నర్సింహమూర్తి, ఎస్‌బి సిఐ ఎ.వి.లీలారావు, ఆర్‌ఐ ఎన్‌.గోపాల నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️