సమాన పనికి సమాన వేతనమివ్వాలి

Sep 30,2024 21:31

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు. ఆలిండియా డిమాండ్స్‌డే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, కంటెంజెంట్‌, టైంస్కేల్‌ తదితర పేర్లతో పని చేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలలోనూ ఆర్టీసి, విద్యుత్తు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థలలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత, సెలవులు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ వంటి కార్మిక చట్టాలు అమలు కావడం లేదన్నారు. గతంలో ఐదేళ్లుఏదైనా ఒక సంస్థలో పని చేస్తే ప్రభుత్వం వారిని రెగ్యులరైజ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేదని, కానీ నేడు జాయినింగ్‌ దగ్గర నుంచి రిటైర్మెంట్‌ అయ్యే వరకు పనిచేసినా పర్మినెంట్‌ చేయకపోవడం అన్యాయమని అన్నారు. గత ప్రభుత్వం ఆప్కాస్‌ ఏర్పాటు చేసిన తరువాత జీవితంలో పర్మినెంట్‌ అయ్యే అవకాశమే లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తున్న వారిని పర్మినెంట్‌ చేయాలన్నారు. అప్పటివరకు పర్మినెంట్‌ వర్కర్‌ తో సమానంగా జీతాలు చెల్లించాలని, అలా చెల్లించని యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత ధరల ప్రకారం కనీసం నెలకు రూ.26వేలకు తక్కువ లేకుండా చెల్లించాలని అన్నారు. ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేష్‌, ఉపాధ్యక్షులు టి.వి.రమణ, జిల్లా కార్యదర్శులు ఎ.గౌరి నాయుడు, బి. సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షులు ఎ.జగన్మోహన్‌, సిహెచ్‌.ముత్యాలు, ఎ.సురేష్‌, మున్సిపల్‌, ఆర్టీసీ, స్టోర్‌ హమాలీ, హెచరిస్‌, బేవరేజెస్‌ తదితర రంగాల కార్మికులు పాల్గొన్నారు.

➡️