చెరువు ఆక్రమణ పరిశీలన

Feb 16,2025 21:32

ప్రజాశక్తి- బొబ్బిలి : రామభద్రపురం మండలంలోని కొట్టక్కి రెవెన్యూ పరిధిలోని జాతీయ రహదారి పక్కనున్న సుమారు రూ.10 కోట్లు విలువ చేసే చెరువు ఆక్రమణలను సిపిఎం నాయకులు పి. శంకరరావు ఆదివారం పరిశీలించారు. సర్వే నెంబర్‌ 431-5 సుమారు ఎకరా చెరువు ఆక్రమించుకుంటున్నారని తెలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే చెరువుపై ఆక్రమణకు గురవుతుందని తహశీల్దార్‌, ఆర్‌డిఒలకు కొంతమంది ఫిర్యాదు చేయగా రామభద్రపుంర తహశీల్దార్‌ ఆక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు పెడతామని ఒక నోటీసు జారీ చేశారని సంవత్సరం తిరక్క ముందే రికార్డులు తారుమారు చేసేసి కబ్జాకు పాల్పడుతున్నారని చెప్పారు. చెరువులను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి రికార్డులు మార్చి చెరువులను మాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఎవరెవరున్నారో పేరుతో సహా రాబోయే రోజుల్లో బయటపెట్టి వాళ్ళ పైన కేసులు పెడతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని సమగ్రంగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ పరిశీలనలో సిపిఎం పార్టీ నాయకులు ఎస్‌ గోపాల్‌, బలస శ్రీను పాల్గొన్నారు.

➡️