తప్పని ముప్పు

Jun 9,2024 21:53

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర పాలక సంస్థ పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థ ఆస్తవ్యస్తంగా ఉంది. చెత్తా చెదారంతో నిండిన పరిస్థితి. మురుగు కదలదు.. వదలదు అన్న చందంగా పరిస్థితి తయారైంది. సాధారణంగా ఏటా వర్షాకాలం ముందే కాలువల్లో పూడిక తొలగించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఎన్నికలు కావడంతో నగరంలో పూడికతీత పనులు చేపట్టలేదు. ప్రధాన కాలువలు పూడికతో నిండి పోయినా ఆ దిశగా చర్యలు లేవు. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా.. ఆయా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. రెండు సార్లు సాయంత్రం కురిసిన వర్షానికి కార్పొరేషన్‌ కార్యాలయ పరిసర ప్రాంతాలు చెరువును తలపించేలా నీరు నిండిపోవడమే అందుకు నిదర్శనం.పదేళ్ల క్రితం నగరంలోని సిటీ స్టాండుకు వెళ్లే దారిలో కర్రబడ్డీల వద్ద ఉన్న కాలువలో వరదనీటి ఉధృతికి ఓ మహిళ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఆ కాలువపై పలకలు వేయలేదు. దీంతో అక్కడ ముప్పు పొంచి ఉంది. నగర పాలక సంస్థ కార్యాలయ సమీపంలో కాలువలతోపాటు గంటస్తంభం, పిడబ్ల్యు మార్కెట్‌, సిటీ స్టాండ్‌, లంకవీధి వద్ద కాలువలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో వరద నీటి కాలువలు 100 మీటర్ల పరిధిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అన్నీ పూడికతో దర్శనమిస్తున్నాయి. ట్యాంక్‌బండ్‌ రోడ్డులో ఎల్‌ఐసి కార్యాలయం వద్ద నుంచి నాయుడుకాలనీ, వినాయకనగర్‌, పద్మావతినగర్‌ మీదుగా ధర్మపురి వరకు 3 కిలోమీటర్ల మేర పెద్దకాలువలు ఉన్నాయి. వీటిలో ఎక్కడా పూడిక తీసిన ఆనవాళ్లు లేవు. వర్షం కురిస్తే సిటీ స్టాండ్‌, నగర పాలక సంస్థ కార్యలయం, గంటస్తంభం, పార్కు గేటు కూడలి ముంపునకు గురవుతాయి. ధర్మపురి, రింగ్‌రోడ్డు ప్రాంతాలతోపాటు పలు కాలనీల్లో ఇవే పరిస్థితులు నెలకొంటున్నాయి. నగరంలో మురుగు కాలువలు రోజుల తరబడి శుభ్రం చేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. మధ్యాహ్నం వేళల్లో గ్యాంగ్‌ వర్కు ద్వారా పూడికతీత చేపట్టేవారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో జరగడం లేదు. మరికొన్ని చోట్ల కాలువల్లో నాణ్యతాలోపాలు, వంకర టింకర కట్టడాలతో మురుగునీరు ముందుకు వెళ్లకుండా రోడ్డెక్కుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక నగరంలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు కలగానే మిగిలింది. ఇది కేవలం డిపిఆర్‌ తయారు వరకు పరిమితమైంది తప్ప ఆచరణకు నోచుకోలేదు. కాలువ వ్యవస్థ మెరుగు కోసం శాశ్వత పరిష్కారం దిశగా భూ గర్భ కాలువ వ్యవస్థ నిర్మాణం జరిగితే తప్ప పరిష్కారం లభించదు. అది ఎప్పటికి పూర్తవుతుందో పాలకులు చెప్పాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దృష్టి పెడుతుందో, లేదో వేచి చూడాల్సిందే.

➡️