ప్రజాశక్తి – నెల్లిమర్ల : రైతులు దళారులను ఆశ్రయించొద్దని, ప్రభుత్వమే కనీస మద్దతుధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. మండలంలోని సతివాడలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు ముందుగానే సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఎడిఎ ఎన్ కోటేశ్వరరావు, ఎంపిడిఒ కె. రామకృష్ణరాజు, తహశీల్దార్ పి. సుదర్శన రావు, ఎఒ ఎం.పూర్ణిమ, సిఎస్‌డిటి, ఇఒపిఆర్‌డి, జనసేన మండల నాయకులు చనమల్ల వెంకట రమణ, సర్పంచ్ రేవల్ల శ్రీనివాసరావు, ఎంపిటిసి రెడ్డి సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.తెర్లాం: మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే బేబినాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం సేకరణకు గోని సంచులతో సహ రవాణా ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇకేవైసీ, ఈ పంట నమోదు చేసుకున్న రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తారని స్పష్టంచ చేశారు. ధాన్యం వాహనంలలో ఎగుమతి చేసిన దగ్గర నుండి రైస్ మిల్లు వద్ద దిగుమతి అయ్యేవరకు జిపిఎస్ పరికరం ద్వారా ట్రాక్ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఒ సునీల్ కుమార్, తహశీల్దార్ హేమంత్ కుమార్, ఎంపిడిఒ రాంబాబు, ఎంపిపి ఉమాలక్ష్మి, టిడిపి మండల అధ్యక్షులు ఎన్ వెంకట్ నాయుడు, మాజీ ఎంపిపి ఎన్ వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.పూసపాటిరేగ: మండలంలోని రెల్లివలసలో మంగళవారం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, దాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.శృంగవరపుకోట: మండలంలోని గౌరీపురం గ్రామంలో కృష్ణ మహంతి పురం పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు కూడా కొనుగోలు కేంద్రం వద్ద మాత్రమే ధాన్యం అమ్మాలని , ధాన్యం ఇచ్చిన రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఈ అవకాశాన్ని రైతులు అందరు వినియోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఒ కె.రవీంద్ర, ఎంపిపి సండి సోమేశ్వరావు, బుల్లిబాబు, మాజీ ఎంపిపి ఒంటి అప్పారావు, పెదకండేపల్లి సర్పంచ్ యాళ్ళ రమణ తదితరులు పాల్గొన్నారు.తెలుగు తమ్ముళ్ల బారుకట్‌నెల్లిమర్ల: నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లో మంగళవారం పలు ధాన్యం కేంద్రాలు ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమాలకు టిడిపి నాయకులకు సమాచారం లేకపోవడంతో వారంతా ఈ కార్యక్రమాలను బారుకట్ చేశారు. దీంతో ఎమ్మెల్యే తూతూ మంత్రంగా కేంద్రాలను ప్రారంభించి వెళ్లిపోయారు.