ప్రజాశక్తి-భోగాపురం : చేపలు గుడ్లు పెట్టే సీజన్‌లో ప్రతి ఏడాది సముద్రంలో వేటను నిషేధిస్తుంటారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా ప్రభుత్వం చేపల వేటను నిషేధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 15వ తేదీ నుంచి జూన్ 14 వరకు, అనగా 61 రోజుల పాటు వేటను నిషేధించింది. ఈ సమయంలో ఎవరైనా వేటకు వెళ్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. కాని గతేడాది వేట నిషేధ భృతి చెల్లించలేదు. అంతేకాదు, ఇప్పటి వరకు ఈ ఏడాదికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కూడా కొత్తగా చేపట్టకపోవడం గమనార్హం. దీంతో ఈ రెండు నెలల పాటు తామెలా బతికేదని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.
చేపలు సంతానోత్పత్తి కోసం ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి రెండు నెలలపాటు గుడ్లు పెడుతుంటాయి. అలాంటి సమయంలో ఈ వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. జిల్లాలో పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో తీరప్రాంత గ్రామాలు ఉన్నాయి. ఇందులో భోగాపురంలో ఐదు, పూసపాటిరేగ మండలంలో 11 గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు మండలాల నుంచి సుమారు 1121 ఇంజిన్ బోట్లు నిత్యం ఈ ప్రాంతంతోపాటు విశాఖ నుంచి వేటకు వెళ్తుంటాయి. ఈ ప్రాంత మత్స్యకారులంతా చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఈ రెండు నెలల కాలంలో వేట లేకపోవడంతో వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం వేట నిషేధ భృతి చెల్లించేది. గత ప్రభుత్వం మత్స్యకార భరోసా పేరుతో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడుకి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున జమచేసేది. గత ఏడాది ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ పథకాన్ని అప్పటి వైసిపి ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ఏడాది అందిస్తామని టిడిపి కూటమి ప్రభుత్వం ప్రకటించినా ఇంత వరకు లబ్ధిదారులను గుర్తించలేదని మత్స్యకారులు అంటున్నారు.
మత్స్య సంపదను పెంపొందించేందుకే..
సముద్రంలో మత్స్య సంపదను పెంపొందించేందుకే రెండు నెలల పాటు ప్రభుత్వం చేపల వేటను నిషేధిస్తుంది. ఈ సమయంలో వివిధ చేప, రొయ్యి జాతులు గుడ్లు పెట్టి తమ సంతానోత్పత్తిని పెంపొందిస్తుంటాయి. ఈ సమయంలో తల్లి చేపలు, రొయ్యలను రక్షించేందుకు వేటను నిషేధిస్తారు. దీంతో మత్స్య సంపద పెరిగి, తిరిగి మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు అధికారులు. అందుకు ఈ సమయంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని చెబుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే..
చేపలు గుడ్లు పెట్టే సమయంలో యాంతిక పడవలను సముద్రంలోకి వెళ్లేందుకు అనుమతించరు. ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం ఎవరైనా ఉల్లంఘించి వేటకు వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటారు. వేటకు వెళ్తే వారి వద్దనున్న మత్స్యసంపదను స్వాధీనం చేసుకుంటారు. అంతేకాక జరీమానాతో పాటు డీజిల్ రాయితీ, అన్ని రకాల సబ్సిడీ సౌకర్యాలను నిలుపుదల చేస్తారు. మెరైన్ పోలీసులు, కోస్టుగార్డులు, కోస్టల్ సెక్యూరిటీ, నేవీ, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు నిత్యం పహారా కాస్తుంటారు. కాని ఇంజిన్లు లేని తెప్పల్లో వేట చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇవి కూడా కేవలం తీరం నుంచి ఎనిమిది నాటికల్ మైళ్ల దూరం లోపలే వేట చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
వేట నిషేధ భృతి అందక..
వేట నిషేధ సమయంలో ప్రతి ఏడాదీ ఏ ప్రభుత్వం ఉన్నా వారిని ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకునేది. కాని వైసిపి ప్రభుత్వం వచ్చాక వేటకు వెళ్లే ప్రతీ మత్స్యకారుడికి రూ.10 వేలు చొప్పున మత్స్యకార భరోసా పేరుతో అందజేసేది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో మొత్తం 3522 మందికి అందజేశారు. ప్రతి ఏడాది మే నెలలో ఈ పథకాన్ని అమలు చేసేవారు. గత ఏడాది ఎన్నికలు ఉండడంతో లబ్ధిదారులకు అందజేయలేదు. ఇంతలో వైసిపి ఓడిపోగా, కొత్తగా టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. గత ఏడాదికి చెందిన భృతి ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ ఏడాదికి కొత్తగా లబ్ధిదారుల ఎంపిక కూడా చేపట్టకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
