ఫుడ్‌ పార్క్‌ కార్మికుల ఆందోళన

Feb 4,2025 21:08

ప్రజాశక్తి-చీపురుపల్లి : చెమటోడ్చి కష్టపడుతున్న తమ కష్టాన్ని గోడౌన్‌ నిర్వాహకులు నిలువునా దోచుకుంటున్నారని మండలంలోని పత్తికాయవలస వద్ద గల ఫుడ్‌పార్క్‌ గొడౌన్‌ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తమకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా మంగళవారం గోడౌన్‌ ముందు నిరసన తెలుపుతూ లారీలను నిలిపివేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 2018లో గోదాం ప్రారంభించిన నాటి నుంచి ఫుడ్‌పార్క్‌ పరిసరాలలోని పత్తికాయవలస, పత్తికాయపాలవలస, బెవరపేట, లింగాలవలస గ్రామాలకు చెందిన 150 కుటుంబాలు ఇదే గోడౌన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. ప్రజా పంపిణీకి అవసరమైన బియ్యాన్ని లారీల నుంచి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేయడం వంటి పనులను నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక లారీ లోడింగ్‌ అన్‌లోడింగ్‌కు రూ. 9,500 చెల్లించాల్సి ఉన్నప్పటికీ రూ.5వేలు మాత్రమే ఇస్తున్నారని కెఎల్‌పురం, గజపతినగరం, కాపుసంభాం, రాజాం ప్రాంతాలలో గల ఫుట్‌ కార్పొరేషన్‌ గోడౌన్లలో ఒక లారీ లోడు లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు రూ.6,500 చెల్లిస్తున్నారని ఇక్కడ మాత్రం రూ.5వేలు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన ప్రాంతాల మాదిరికే తమకు కూడా రూ.6,500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్థానికంగా ఉన్న తమని విధుల నుంచి తప్పించి ఇతర ప్రాంతాలకు చెందిన కార్మికులను రప్పిస్తే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గోడౌన్‌ యాజమాన్యం రామరాజు అందుబాటులో లేకపోయి నప్పటికీ ఇంఛార్జిగా అక్కడ విధులు నిర్వహిస్తున్న రాముకు తమ సమస్యలు విన్నవించుకున్నప్పటికీ కనీసం పట్టించుకోలేదన్నారు యాజమాన్యం మొండి వైఖరి కారణంగా సుమారు 150 కుటుంబాలు జీవనాధారం లేక రోడ్డున పడే ప్రమాదం ఉందని పాలకులు అధికారులు తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చేయాలని కోరారు. ఈ విషయంపై గోడౌన్‌ ఇంఛార్జి రామును వివరణ కోరగా గోడౌన్‌లో కార్మికులకు సంబంధించి రెండు నెలల క్రితం కాంట్రాక్ట్‌ ఒప్పందం కుదిరిందని, ఒప్పందం మేరకే డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పారు.

➡️