ప్రజాశక్తి- గజపతినగరం : దళిత కాలనీలో మంచినీరు సమృద్ధిగా ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మండలంలోని బంగారంపేట గ్రామంలో సిపిఎం నాయకులు సోమవారం పర్యటించి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దళిత కాలనీలో ఇంటింటి కొళాయిలు నిర్మించాలని, రోడ్లు, కాలువలు నిర్మించాలని, టిడ్కో బిల్లులు చెల్లించాలని, పడిపోతున్న విద్యుత్ స్తంభం స్థానాన కొత్త స్తంభం వేయాలని, పంచాయతీ కార్యాలయం నుండి దళిత కాలనీ వరకు రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరారు. అనంతరం సంతకాలతో కూడిన వినతిని అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని సమస్యలను పరిష్కరించే దిశగా లేవని, పోరాటాల ద్వారా హక్కులు సాధించుకుని సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమించడమే పరిష్కారమని తెలిపారు. స్థానిక అధికారులకు సమస్యలు వివరించిన తర్వాత పరిష్కారం కానీ ఎడల జిల్లా వ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలతో పాటుగా ఉపాధి హామీ పథకం రక్షణకు ఉద్యమించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి.కృష్ణ, కె.లక్ష్మణ, కె.ఈశ్వరరావు, రేపక గౌరమ్మ, రాము, సత్యం తదితరులు పాల్గొన్నారు.కనపాకలో ప్రజా చైతన్య యాత్ర విజయనగరం టౌన్ : ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు సిపిఎం ఆధ్వర్యాన చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సోమవారం కనపాక రజక వీధిలో సాగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పి. రమణమ్మకు స్థానిక ప్రజలు తమ సమస్యలను వివరించారు. కరెంటు స్తంభాలు వేసి వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, ఇంటి పన్నులు లేని వాటికి పన్నులు వేయాలని కోరారు, ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అందుకు సంబంధించిన పోరాట కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 3వ వార్డు పూల్‌బాగ్ డబుల్ కాలనీలో పేదలకు ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాలు గా ఇవ్వాలని, పట్టాలు ఇవ్వాలని స్థానిక సచివాలయ అధికారులును నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు కోరారు.
