ప్రజాశక్తి – రామభద్రపురం : ప్రతీ వ్యక్తి సంకల్ప బలంతో వ్యసనాల మహమ్మారి నుంచి విముక్తి పొందాలని బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు సూచించారు. స్థానిక గ్లోబల్ స్కూల్లో బుధవారం విద్యార్థులకు జిల్లా ఎస్‌పి అమలు చేస్తున్న సంకల్పం లక్ష్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యసనాల బారిన పడిన కుటుంబ దీన గాథలు, సమాజంలో వారికి కలిగే దుష్ఫలితాలను తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మాదకద్రవ్య వినియోగం పెరిగిందని, చెడు వ్యసనాల పట్ల యువత ఆకర్శితులవుతున్నారని దీనిని రూపుమాపేందుకు విద్యార్దులు ముందడుగు వేయాలని పిలుపు నిచ్చారు. రహదారి భద్రతా నియమాలు పాటించాలన్నారు. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారనీ వీరి ఆగడాలు అప్రమత్తతో నివారించుకొనే పద్ధతులు వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కృషి చేస్తామని విద్యార్థి, ఉపాద్యాయ బృందంతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ చంద్రమోహన్, ఉపాద్యాయ సిబ్బంది పాల్గొన్నారు.