ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్, శంకరం వేదిక వారు సంయుక్తంగా ఈ నెల 22న హైదారాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విజయనగరానికి చెందిన రచయిత జి.వి.శ్రీనివాస్ కు కథా సాహిత్యం విభాగంలో గిడుగు జాతీయ పురస్కారం అందుకున్నారు. విభిన్న కథలలో సామాజిక సమస్యలను తనదైన శైలిలో ఆయన ఎత్తి చూపారు. సాంఘిక, హాస్య, సరస, క్రైమ్,బాల,లేఖా సాహిత్య కథలలో తన ముద్ర వేశారు. సామాజిక సమస్యలపై చక్కని వ్యాసాలను కూడా ఆయన రాశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర స్థానిక చరిత్రలపై పరిశోధన చేసి వరుసగా విశాఖ సంస్కృతి మాసపత్రికలో రాసిన ‘చరిత్ర చెప్పిన కథలు’ సాహిత్య చరిత్ర భాషాభిమానులును ఎంతగానో ఆకట్టు కున్నాయి. వీరి కథలు ఎన్నో కథా సంకలనాలలో స్థానం సంపాదించాయి. జి.వి.శ్రీనివాస్ కథల సంపుటి ‘మనసైన కథలు’ వీరికి ఎంతగానో పేరు తీసుకువచ్చింది. ఎంతో ప్రతిష్టాకరమైన గిడుగు జాతీయ పురస్కారం అందుకున్నందుకు సాహితీవేత్తలు ఎన్.కే.బాబు, చీకటి దివాకర్, ప్రముఖ రచయిత మంజరి, కథాస్రవంతి పప్పు భోగారావు, విశాఖ సంస్కృతి మాస పత్రిక సంపాదకులు శిరేల సన్యాసిరావు , ప్రముఖ కవి, విమర్శకులు మానాపురం రాజా చంద్రశేఖర్, పలువురు ప్రముఖులు పురస్కార గ్రహీత శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేశారు.
