నేటి నుంచి గోకులాలు ప్రారంభం

Jan 9,2025 21:11

ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లాలో నిర్మాణం పూర్తయిన గోకులాలను ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఎంపిడిఒలను ఆదేశించారు. ఆయా మండలాల్లో ప్రజా ప్రతినిధులతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని ఎంపిడిఒలతో గురువారం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 981 గోకులాలను మంజూరు చేసినట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న వాటిని నెలాఖరుకల్లా పూర్తిచేసి, వాటిని కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గోకులాల ప్రారంభోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పూర్తయిన ఉపాధిహామీ పనులకు సంబంధించిన బిల్లులను ఆన్‌లైన్‌లో వెనువెంటనే అప్‌ లోడ్‌ చేయాలని సూచించారు. రూ.45 కోట్ల విలువైన 866 పనులను పూర్తిచేసినప్పటికీ రూ.23 కోట్ల బిల్లులనే అప్‌లోడ్‌ చేశారని చెప్పారు. పూర్తయిన పనులకు బిల్లులను కూడా వెంటనే అప్‌లోడ్‌ చేయడంపై శ్రద్ధ చూపాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిషత్తు సిఇఒ బి.వి.సత్యనారాయణ, డ్వామా పీడీ శారదాదేవి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ శ్రీనివాస్‌, డిపిఒ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️