ప్రజాశక్తి-విలేకర్ల యంత్రాంగం : రైతులకు 48 గంటల్లో ధాన్యం డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. ట్రక్ షీట్ జనరేట్ చేసిన వెంటనే ఎఫ్‌టిఒలను జనరేట్ చేస్తే 48 గంటల్లో రైతులకు నగదు జమవుతుందని చెప్పారు. శుక్రవారం గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదాం మండలాల్లో జెసి పర్యటించారు. ధాన్యం కొనుగోళ్లను తనిఖీ చేశారు. గరివిడిలో అక్నాలెడ్జిమెంట్ ఉండే మిల్లులను, చీపురుపల్లిలో బఫర్ గోడౌన్‌ను, మెరకముడిదాంలో రైస్ మిల్లులను, రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది యాప్‌లో సక్రమంగా నమోదు చేయాలన్నారు. ఫీల్డ్ స్టాఫ్, కస్టోడియన్ అధికారులు బాధ్యతగా పని చేయాలని ఆదేశించారు. తుపానును దృష్టిలో పెట్టుకొని నూర్చిన ధాన్యాన్ని రైతులు సురక్షితంగా ఉంచాలని తెలిపారు. తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జెసితో చీపురుపల్లి ఆర్‌డిఒ సత్యవాణి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ మీనాకుమారి, ఆయా మండల తహశీల్దార్లు, సిఎస్ డిటిలు పాల్గొన్నారు.