ప్రజాశక్తి-విజయనగరం కోట : మహాకవి గురజాడ వెంకట అప్పారావు రచనలు ఎన్నేళ్లు గడిచినా సజీవంగా నిలుస్తాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ అన్నారు. స్థానిక ఆనంద గజపతి కళాక్షేత్రంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యాన గురజాడ 109వ వర్థంతి సభను శనివారం నిర్వహించారు. తొలుత ఆయనతోపాటు ప్రముఖ రచయిత మీగడ రామలింగస్వామి.. జ్యోతి ప్రజ్వలన చేసి, గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రామలింగస్వామికి గురజాడ విశిష్ట పురస్కారాన్ని ఎన్‌వి రమణ, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అందజేశారు. అనంతరం జరిగిన సభలో ఎన్.వి.రమణ మాట్లాడుతూ విజయనగరం విశిష్టతను కొనియాడారు. గురజాడ, హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామి నాయుడు, కోడి రామ్మూర్తి, ఘంటసాల, సుశీల, చాగంటి, శ్రీశ్రీ, రాచకొండ.. ఇలా ఎందరో మహనీయులు నడయాడిన నేల ఇదేనన్నారు. ఆనాటి సమాజంలో ఉన్న రుగ్మతలపై గురజాడ రచనలు సాగించారని తెలిపారు. పురస్కార గ్రహీత రామలింగస్వామి మాట్లాడుతూ గురజాడ రచనల ద్వారా సమాజ రుగ్మతలను రూపుమాపడానికి కృషి చేశారన్నారు. అనంతరం జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితా పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. గంట్యాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కె.పద్మజ రచించిన ‘అమ్మ కంటే ముందు’ అనే కవితకు పురస్కారం లభించింది. ఆమెకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక, రూ.2 వేలు నగదు బహుమతిని ఎన్‌వి రమణ, రామలింగస్వామి, నిర్వాహకులు అందజేశారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తొలుత గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యాన గురజాడ అప్పారావు నివాసంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురజాడ వినియోగించిన వస్తువులతో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో గురజాడ వారసులు వెంకట అప్పారావు, ఇందిరా, కుటుంబ సభ్యులు, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ, గురజాడ సాంస్కతిక సమాఖ కార్యదర్శి కాపుగంటి ప్రకాశ్, రోటరీ డాక్టర్ వెంకటేశ్వరరావు, సూర్యలక్ష్మి, సాహితీ వేత్తలు ఎ.గోపాలరావు, బిహెచ్ సూర్యలక్ష్మి, మానాప్రగడ ఎం.వి.ఆర్.కృష్ణాజీ, తదితరులు పాల్గొన్నారు.
పైడితల్లమ్మను ఎన్.వి.రమణ
విజయనగరం టౌన్ : సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ పైడితల్లమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయం వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్‌పి కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా జడ్జి బి.సాయి కల్యాణ చక్రవర్తి, కలెక్టర్ బి.ఆర్.అంబేద్క్కర్, ఎస్‌పి వకుల్ జిందాల్, ఆర్‌డిఒ కీర్తి తదితరులు స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్‌పి కలిశెట్టి ఆయనకు పివైజి రాజు ది లాస్ట్ మహారాజ్ ఆఫ్ విజయనగరం అనే పుస్తకాన్ని అందించారు.