ప్రజాశక్తి-గజపతినగరం, భామిని : ఉపాధ్యాయుల స్కూలు లీడర్‌షిప్ రెసిడెన్షియల్ (ఎస్‌ఎల్‌డిపి) శిక్షణలో ఓ ప్రధానోపాధ్యాయుడు గుండె పోటుతో మృతి చెందారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి వద్ద బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానోపాధ్యాయుల కు స్కూలు లీడర్‌షిప్ పేరిట ఆరు రోజులపాటు శిక్షణ ఇస్తోంది. అందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం నులకజోడు ఎంపి యుపి స్కూల్ హెచ్‌ఎం శ్రీనివాసరావు (52) మరుపల్లిలోని బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలలో శిక్షణకు హాజరయ్యారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు అందరూ అక్కడే రాత్రిపూట బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. సమాచారం తెలిసిన వెంటనే విజయనగరం, పార్వతీపురం మన్యం డిఇఒలు మాణిక్యం నాయుడు, ఎన్.తిరుపతినాయుడు ఘటనా స్థలానికి చేరుకొని హెచ్‌ఎం మృతదేహాన్ని పరిశీలించారు. యుటిఎఫ్ నాయకులు పి.రమేష్ చంద్రపట్నాయిక్, చింతా భాస్కరరావు అక్కడికి చేరుకొని విచారం వ్యక్తంచేశారు. సౌకర్యాలు లేకుండా ఇలాంటి శిక్షణ ఇవ్వడం సరికాదని, వెంటనే శిక్షణను రద్దు చేయాలని ఉపాధ్యాయులంతా నిరసన తెలిపారు.
శ్రీనివాసరావు కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయ కులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిఇఒ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. శిక్షణల పేరుతో మానసిక ఒత్తిడికి గురిచేయడం వల్లే హెచ్‌ఎం మరణించా రన్నారు. బోధనకు ఆటంకం లేకుండా శిక్షణలు వేసవి సెలవుల్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గరివిడి, వంగర మండల వనరుల కేంద్రాల వద్ద ఉపాధ్యాయులు నిరసనలు తెలిపారు.