పలుచోట్ల భారీ వర్షాలు

Apr 28,2025 21:07

ప్రజాశక్తి-శృంగవరపుకోట : జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. శృంగవరపుకోటలో వర్షానికి మురుగు కాలువల్లో నీరు ఉప్పొంగి రోడ్లపై ప్రవహించింది. శృంగవరపుకోట పట్టణంలో ఈదురు గాలులకు ఫ్లెక్సీలు నేలకొరిగాయి. చాలాచోట్ల మామిడికాయలు నేలరాలాయి. మరికొన్నిచోట్ల అరటి తోటలు నేలకొరిగాయి. అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. పట్టణంలోని విశాఖ-అరకు రహదారిలో రోడ్లపై నీరు చేరడంతో పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.వంగర : మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఎం.సీతారాంపురం, తలగాం, శివ్వాం, వంగర, ఓని అగ్రహారం, తదితర గ్రామాలలో కురిసిన వర్షానికి వీధుల్లో వర్షపు నీరు చేరి జలమయమయ్యాయి. వివిధ గ్రామాలలో మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో రోడ్లపై నీరు ప్రవహించి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.సంతకవిటి: మండలంలోని సంతకవిటి, తలాడ, మందరాడ, కొండగూడెం, ఎం.ఆర్‌ అగ్రహారం తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.

➡️