రామోజీరావు ఇకలేరని కలత చెందా

Jun 8,2024 12:15 #Vizianagaram

కలిశెట్టి

ప్రజాశక్తి,-విజయనగరం కోట : ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఇక లేరని తెలిసి, తనకు ఎంతగానో బాధ కలుగుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. తను ఈనాడు రిపోర్టర్ గా సేవలందించినప్పుడు జీవిత పాఠాలను సిద్ధింపజేసిన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గౌరవనీయులు చెరుకూరి రామోజీరావు ఇక లేరని తెలియడంతో కలత చెందానని అప్పలనాయుడు చెప్పారు. ఈనాడులో గ్రామీణ ప్రాంతం నుంచి రిపోర్టర్ గా పనిచేసిన తనకు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రస్థాయి అవార్డును చైర్మన్  ప్రకటించారని, ఈనాడు గ్రూప్ సంస్థల ఎండి కిరణ్ చేతుల మీదుగా ఇదే అవార్డును అందుకోవడం ఎంతో అనుభూతి కలిగించిందని, ఇలా తనకు చైర్మన్ ఎంతగానో ప్రోత్సహించారని అప్పలనాయుడు గుర్తు చేసుకున్నారు. అలాగే చైర్మన్ స్వయంగా హైదరాబాద్ పిలిపించుకొని, ఆయన స్వహస్తాలతో మనస్ఫూర్తిగా తనను దీవించిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. అలాగే వ్యక్తిగతంగా గ్రామీణ ప్రాంత విలేకరి విధుల నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత, అదే ప్రేమాభిమానంతో నా కుటుంబ సభ్యులైన భార్య శ్రీమతి ప్రభా నాయుడు, కుమార్తె నిఖిలను తనతోపాటు వారిని కూడా చైర్మన్ ఆశీర్వదించిన మధుర జ్ఞాపకాలు తలుచుకున్న ప్రతిసారి కన్నీరు పెట్టిస్తున్నాయని అన్నారు. చైర్మన్ ఛాంబర్ లో తాను అడుగుపెడుతున్నప్పుడు, అక్కడున్న సిబ్బంది తమ పట్ల చూపిన ప్రేమాభిమానం అనుభవిస్తున్నప్పుడు.. చైర్మన్ ఎలాంటి విలువలు పాటించారో స్పష్టమైందని అప్పలనాయుడు గారు చెప్పారు. అలాగే వారిని( చైర్మన్ ) ఢిల్లీలో స్వర్గీయ ఎర్రం నాయుడు కుమార్తె వివాహం రిసెప్షన్ లో కలిసినప్పుడు, వారి నుంచి ఆశీర్వాదం తీసుకున్న సమయంలో చైర్మన్ స్పర్శ తనలో మరింత శక్తివంతమైన ఆలోచనలు కలిగించాయని అప్పలనాయుడు వివరించారు. ఆ సందర్భంలో చైర్మన్ మాట్లాడిన ఒకటి రెండు మాటలు తనకు ఎంతగానో స్ఫూర్తిని కలిగించాయని అన్నారు. సమాజం పట్ల ఒక వ్యక్తి ఎలా ఉండాలో ఆదరణగా చైర్మన్ కొద్ది మాటల్లో చెప్పడం ద్వారా జీవిత పాఠాల్ని మరోసారి తనకు అవగతం చేశారని తెలిపారు. చైర్మన్ ఈనాడు సమీక్షల ద్వారా పాత్రికేయ మిత్రులకు అందించిన సూచనలు, సలహాలు ఎంతో మంది మంచి పాత్రికేయుల్ని, సమాజం పట్ల ఎంతో మంచి బాధ్యత కలిగిన పౌరులుగా ప్రేరణ కలిగించాయని అన్నారు. వారి సంస్థలో పని చేసేటప్పుడు ఈనాడు ఈటీవీ( అన్నదాత)లకు సేవలందించినప్పుడు వారు అందించిన పారితోషకంతో ఆదా చేసుకుంటూ.. మొదటిగా వ్యవసాయదారుడు గా అప్పట్లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశానని అన్నారు. ఇప్పటికీ ఆ భూమిలో వ్యవసాయం సాగు చేసుకున్నానని అన్నారు. అలాగే తొలిసారిగా నా జీవితంలో మార్గదర్శి చిట్స్ ఫండ్ లో ఆదా చేసి, ఇలా పొదుపు చేయగా వచ్చిన నిధులతో మరికొంత భూమిని కొనుగోలు చేసి, ఈరోజు స్వేచ్ఛగా, నిజాయితీగా కుటుంబ జీవనానికి అవసరమైన వనరుల్ని సమకూర్చుకున్నానని అప్పలనాయుడు గారు చెప్పారు. ఈ రోజున వారు ఇచ్చిన ఆదర్శమైన సూచనలు, సలహాలు, నిబద్ధత, వారు సంస్థల నుంచి వచ్చిన ఆదాయ వనరులు ఈరోజు సమాజానికి, తన వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడ్డాయని గుర్తు చేసుకున్నారు. ఇలా తన జీవితానికి మార్గదర్శనం చేసిన చైర్మన్ కి జీవితాంతం రుణపడి ఉంటాను అని అప్పలనాయుడు అన్నారు. వారి మూలాలకు తాను, తన కుటుంబం కృతజ్ఞులమై ఉంటామని తెలిపారు. ఈరోజుకి, ఏ రోజుకైనా చైర్మన్ సమాజానికి అందించిన మార్గదర్శకత్వమైన విలువలు కొనసాగించి,ఆచరించి , సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా జీవిస్తానని, మనస్సాక్షిగా తన ఆత్మకు వివరణ ఇస్తున్నానని అన్నారు. తనలాగే ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చైర్మన్ నుంచి సహాయం పొందిన వారందరి తరఫున ధన్యుణ్ణి అయి ఉంటానని, చరిత్రలో మీకంటూ ఒక ప్రత్యేక పుస్తకం లిఖించినందుకు భావితరాలకు మీ జీవిత పాఠం చరిత్ర ఉన్నంతవరకు పదిలంగా ఉంటుందని అన్నారు. చైర్మన్ విలువల సామ్రాజ్యం నుంచి వచ్చిన ఒక మొక్కగా.. పదిమందికి మంచి ఫలాలు ఇచ్చే ఒక వృక్షంలా ఎగుతానని మాట ఇస్తున్నానని అప్పలనాయుడు పేర్కొన్నారు. ఒకప్పుడు ఈనాడు సంస్థ ఉద్యోగిగా ఉన్న తాను, ప్రస్తుతం విజయనగరం ఎంపీ స్థాయికి ఎదగడం చైర్మన్ గారు ఇచ్చిన స్ఫూర్తి అని అన్నారు. చైర్మన్ గారు విలువల వనంలో నాటిన మొక్క, ఈరోజు సమాజాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్న, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో విలువలకు ప్రతిరూపమైన గౌరవ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పని చేస్తుండటం తన జీవితానికి గర్వకారణంగా ఉందని అప్పలనాయుడు పేర్కొన్నారు.

➡️