ప్రజాశక్తి- శృంగవరపుకోట : గుర్ల ఘటన మరల పునరావృతం కాకుండా ఉండేందుకు పల్లె పల్లెల్లోనూ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చి ప్రతి గ్రామానికి పారిశుధ్య పనులు నిర్వహణకు ఒక ఇంఛార్జిని నియమించినప్పటికీ ధర్మవరం మేజర్ పంచాయతీ వీధులలో, మురుగు కాలువలలో, చెత్త, వ్యర్ధాలు పేరుకుపోయింది. వాడుకనీరు వెళ్లేందుకు అవకాశం లేక మురుగునీరు నిల్వ ఉండడంతో ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తు గ్రామం దుర్గంధ భరితంగా తయారై ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. మండలంలోని రెండు మేజర్ పంచాయతీలు ఉండగా అందులో ఒకటి శృంగవరపుకోట కాగా రెండవది ధర్మవరం మేజర్ పంచాయతీ. ఈ పంచాయతీలో ఎక్కడా స్వచ్ఛత కానరావడం లేదు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య విభాగం అధికారులు, సచివాలయ సానిటరీ కార్యదర్శిలు కనీసం దృష్టి సారించడం లేదని స్థానిక ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరణాలు సంభవిస్తే తప్ప అధికారులు ఈ గ్రామం వైపు చూడరా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి పారిశుధ్య సిబ్బందిని అదనంగా కేటాయించాలని ఎప్పటికప్పుడు పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.శానిటేషన్ డ్రైవ్‌లోనూ పారిశుధ్యాన్ని తొలగించలేదుమా గ్రామంలో ఏళ్ల తరబడి మురుగు కాలువలు చెత్త చెదారాలు నిండి ఉన్న ఎవ్వరికీ పట్టడం లేదు. ఇటీవల నిర్వహించిన సానిటేషన్ డ్రైవ్‌లోనూ గ్రామాన్ని పూర్తిగా శుభ్రపరచలేదు. గ్రామం గుండా పోయే అధికారులకు కనబడే విధంగా బజార్ సెంటర్లో మాత్రమే పారిశుధ్య పనులు నిర్వహిం చారు. జిల్లాలో పారిశుధ్య లోపం వల్ల జరుగుతున్న అనారోగ్య అనర్ధాలపై ప్రతిరోజూ పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలి. అల్లు సన్యాసిరావు ధర్మవరం గ్రామం.ధర్మవరం మేజర్ పంచాయతీకి 6 మంది పారిశుధ్య కార్మికులు మాత్రమే ఉన్నారు. దీని వల్ల గ్రామంలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. ఇటీవల నిర్వహించిన సానిటేషన్ డ్రైవ్‌లో రోజుకు ఏడు మంది చొప్పున 10 రోజులు గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పనులను చేపట్టారు. మురుగు కాలువలు శుభ్రపరిచి చెత్తను తొలగించి వాటర్ ట్యాంకులు శుభ్రం చేయించాం. అయినప్పటికీ గ్రామంలో అక్కడక్కడ పారిశుధ్య లోపం కనిపిస్తుంది. త్వరలో గ్రామంలో పూర్తిగా పారిశుధ్యం తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం.చంద్రశేఖర్, ఇఒ, ధర్మవరం మేజర్ పంచాయతీ