భూ వివాదం నేపథ్యంలోనే హత్యాయత్నం

Apr 15,2025 21:28

ప్రజాశక్తి – రామభద్రపురం : మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జనసేన నాయకునిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడును పోలీసులు గాలించి పట్టుకొని మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను బొబ్బిలి డిఎస్‌పి భవ్య, సిఐ నారాయణరావు వివరించారు. గత కొన్నాళ్లుగా మండల కేంద్రం నడిబొడ్డున ఉన్న వివాదాస్పద స్థలంలో నిందితుడు బోను అక్కునాయుడు కొంత స్థలాన్ని కొన్నారు. అయితే దీనిపై వివాదం ఉండటం జనసేన తరుపున ఆ స్థలంపై ఉద్యమాలు చేయడం ద్వారా హై కోర్టులో స్టే వచ్చింది. అయితే తాజాగా కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రాకపోయినా అక్కునాయుడు తను కొన్న స్థలంలో ఫ్రూట్‌ బిజినెస్‌ చేసేందుకు ఉపక్రమించి నీడ కోసం సిమెంట్‌ స్తంభాలు పాతి వ్యాపారం చేసే ప్రయత్నాలు చేశాడు. దీన్ని గమనించిన జనసేన నాయకుడు మహంతి ధనంజయ వివాదంలో ఉన్న స్థలం, కోర్టు స్టే ఉండగా ఇలా ఇక్కడ వ్యాపారాన్ని చేయడం తగదని హెచ్చరించి రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు. అది తెలుసుకున్న నిందితుడు అక్కునాయుడు కోపంతో రగిలి ప్రతిసారి అడ్డు తగులుతున్నాడని క్షణికావేశంలో ధనంజయ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. అయితే ఇద్దరిదీ ఒకే వీధి కావడంతో ఇంట్లో ఉన్నాడేమో అని అదే వీధిలో కొబ్బరి బొండాలు అమ్మే కిళ్ళీ బడ్డీ వద్ద ఉన్న ఇనుప కత్తిని చేజిక్కించుకొని దాడి చేయాలని పన్నాగం పన్నాడు. ఆ సమయంలో బాదితుడు ఇంట్లో లేడని తెలుసుకొని ఇదే దారిన వస్తాడని నిలిపి ఉంచిన ఒక ఆటోలో మాటువేసి వేచి ఉన్నాడు. ఈ కుట్ర తెలియని బాధితుడు ఎప్పటిలాగే పనులు ముగించుకొని నడిచి ఇంటికి వస్తుండగా వెనుక నుంచి నిందితుడు కత్తితో తలపై వేటు వేయగా అలెర్ట్‌ అయిన బాధితుడు అడ్డుకొనే ప్రయత్నం చేశాడు. దీంతో వీపు, ఎడమచేతి, తలతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయాల బాధతో పరుగెట్టడంతో పాటు చుట్టు పక్కల వాళ్లు ఈ ఉదంతాన్ని గమనించడంతో నిందితుడు మెల్లగా తప్పించుకున్నాడు. బాధితుని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తూ జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో బాధిత ధనంజయ కోలుకుంటున్నాడని నిందితుడు అక్కునాయుడుపై కేసు నమోదు చేసి సాలూరు కోర్టుకు తరలిస్తున్నామని డిఎస్‌పి తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ ప్రసాదరావు, ఎఎస్‌ఐ అప్పారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

➡️