ఇలాగేనా పత్తి రైతుల్ని ఆదుకునేది?

Nov 30,2024 21:54

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ‘ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఇలాగేనా పత్తి రైతుల్ని ఆదుకునేది.? ప్రకటించిన ధరే కంటి తుడుపుగా ఉంది. దీనికితోడు ఈ ఏడాది మదుపు కూడా పెరిగింది. ప్రభుత్వం మద్దతుధరకు కొనుగోలు చేస్తేనే పెద్దగా లాభం వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసిన ఒక్కగానొక్క కేంద్రంలో కనీస మద్దతు ధర దొరకడం లేదు. దీనికితోడు ఇ-క్రాప్‌ నమోదు కాకపోవడం వల్ల ఏకంగా కొనుగోలు చేసేందుకే నిరాకరించడంతో దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది’ ఇదీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో పత్తి రైతుల ఆవేదన. విజయనగరం జిల్లాలో 4,137 ఎకరాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 14,807 ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ ఏడాది వర్షాలు సహకరించడంతో దిగుబడి, నాణ్యత కూడా బాగానే ఉన్నాయి. క్వింటాకు ప్రభుత్వం మద్దతుధర రూ.7,521 ప్రకటించింది. ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతుధర అమలు చేస్తామని జెసి, మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రగల్బాలు పలికారు. వారి మాటలు కోటలు దాటినా, ఆచరణ గడప కూడా దాటలేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు, భామిని సహా పలు అవసరమైనన్ని చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటు విజయనగరంలోనూ అదే పరిస్థితి. ఇక్కడి జెసి, మార్కెటింగ్‌ శాఖ ఎడి కూడా అటువంటి చిలకపలుకులే పలికారు. ప్రణాళికను ప్రజాప్రతినిధులు ఆకాశానికి ఎత్తేశారు. ఆచరణలో ఈ రెండు జిల్లాలకు కలిపి రామభద్రపురం మండలం ముచ్చర్లవలసలో ఒకే కేంద్రాన్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. అది కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందేమీ కాదు సుమా! అక్కడి ప్రతు జిన్నింగ్‌ మిల్లునే కొనుగోలు కేంద్రంగా చిత్రీకరించారు. దీంతో ఈ రెండు జిల్లాల్లోనూ శివారు ప్రాంతాల నుంచి పత్తి తీసుకెళ్లడం వ్యయ, ప్రయాసకు గురికావాల్సిన పరిస్థితి. తీరా తీసుకెళ్లాక నాణ్యత లోపించిందని, ఇ-క్రాప్‌లో నమోదు కాలేదని, నమోదైనప్పటికీ తెచ్చినదంతా తీసుకోవడం కుదరదని కుంటిసాకులు చెబుతున్నారు. ఇందుకు నిబంధనలు కూడా సాకుగా చూపుతున్నారు. కానీ, ఈ సాంకేతిక కారణాలన్నిటికీ బాధ్యులు ఎవరు? ఇ-క్రాప్‌ నమోదు చేయనందుకు రైతు సేవా కేంద్రాల అసిస్టెంట్లు బాధ్యులు కాదా? వారు చేస్తున్న పనిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయనందుకు వ్యవసాయ శాఖ అధికారి బాధ్యులు కాదా? సీజన్‌ చివరి దశకు వచ్చినా, పత్రికలు కోడై కూస్తున్నా, రైతులు గగ్గోలు పెడున్నా మీనమేషాలు లెక్కిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ బాధ్యులు కాదా? అన్నది పబ్లిక్‌ టాక్‌. వీటికి సమాధానం చెప్పాల్సిన రైతు సేవా కేంద్రాల సిబ్బంది తమకు పనిభారం ఎక్కువైపోయిందని, నాలుగైదు రెవెన్యూ గ్రామాల పరిధిలో పనిచేయడం వల్ల కొన్ని తప్పులు దొర్లినమాట వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. దొరికితే దొంగ, లేదంటే దొర అన్నట్టుగా తన పరిధిలోని అటువంటివేమీ జరగలేదని మరికొందరు బుకాయిస్తున్నారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారులైతే అబ్బే అటువంటిదేమీ లేదు, అరకొర తప్ప అంతా బాగానే జరిగిందని బుకాయిస్తున్నారు. జెసిలైతే నోరు మెదిపి రైతులను ఆదుకుంటామన్న మాట కూడా అనడం లేదు. ఇదే అదునుగా గ్రామాల్లోనూ, ప్రతు జిన్నింగ్‌ మిల్లు వద్ద మాటు వేసిన దళారులు రూ.6 వేల నుంచి రూ.6,300 లోపే కొనుగోలు చేస్తున్నారు. రైతుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్నారు. దీనిపై రైతులు, వారి సమస్యలపై పోరాడుతున్న ఎపి రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు.

➡️