ప్రజాశక్తి – రామభద్రపురం : మండలంలోని 2017లో మంజూరైన అంగన్వాడీ భవనాలు ఇప్పటికీ అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. దీంతో అంగన్వాడీ కేంద్రాలను అద్దె భవనాలు, పంచాయతీ కార్యాలయాల్లోనే నడుపుతున్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాలకు కొద్దిపాటి నిధులను వెచ్చిస్తే పనులు పూర్తవుతాయని, అయినప్పటికీ ఆ దిశగా అధికారులు దృష్టి సారించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. సుమారు ఏడేళ్లయినా ఈ భవనాలవైపు కన్నెత్తి చూడకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని పలువురు భావిస్తున్నారు. మండలంలోని 64 అంగన్వాడీ సెంటర్లు ఉండగా వీటిలో 34 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనంలో ఉన్న వాటికి శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే పనులు మాత్రం పూర్తి కాలేదు. నర్సాపురం, పాతరేగ, కొండకెంగువ, కొట్టక్కి, అప్పలరాజుపేట తదితర గ్రామాల్లో గతంలో మంజూరైన ఈ భవనాలు ఫినిషింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. స్వల్ప నిధులు వెచ్చిస్తే ఈ భవనాలు ప్రారంభోత్సవానికి నోచుకుంటాయని నర్సాపురం సర్పంచ్ కోట వెంకటనాయుడు తెలిపారు. అయినప్పటికీ సంబంధిత శాఖాధికారులు వీటిపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియడం లేదని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి భవన నిర్మాణాలను పూర్తి చేయాలని కోరుతున్నారు.మండల సర్వసభ్య సమావేశాల్లో ప్రశ్నించినా..ప్రతి మండల సర్వసభ్య సమావేశాల్లోనూ ఈ అసంపూర్తి భవనాలపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిదులు అధికారులను నిలదీస్తున్నా ఉపయోగం లేకపోతోంది. మరికొన్ని గ్రామాల్లో అద్దెకు ఇచ్చిన అంగన్వాడీ కేంద్రాల యజమానులు తమ ఇళ్లు ఖాళీ చేయాలని నిర్వాహకులపై ఒత్తిడి చేయడం, మరికొన్ని భవనాలు శిధిలావస్థకు చేరడంతో అంగన్వాడీలకి నిర్వహణ ఇబ్బందిగా ఉంది. దీనిపై ఐసిడిఎస్ పిఒ రాజ్యలక్ష్మిని వివరణ కోరగా అసంపూర్తి భవనాలు పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నామని, మరికొన్ని భవనాలకు ప్రతిపాదన కూడా పంపించామని తెలిపారు.