ప్రజాశక్తి – నెల్లిమర్ల : మున్సిపల్ సమ్మె ఒప్పంద జిఒల కోసం ఈనెల 10న నిర్వహించే నిరసన దీక్షలు విజయవంతం చేయాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ. జగమోహన్ రావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించి కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమ్మె ఒప్పందాల్లో భాగంగా గత ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలన్నింటికీ వెంటనే జిఒలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జనవరి 10న స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద జరిగే నిరసన దీక్షలో మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, థర్డ్ పార్టీ విధా నంలో ఉన్న కార్మికులందరినీ మినిమం టైం స్కేల్ పరిధిలోకి తీసుకొచ్చే విధంగా జిఒ నెంబర్2లో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత జిఒతో ఎక్కువ మంది కార్మికులకు పిఆర్‌సి వర్తించదని ఆందోళన వ్యక్తం చేశారు. 12వ పిఆర్‌సిని తక్షణమే ప్రకటించి, గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలకు తక్షణమే జిఒలు ఇవ్వాలని, పర్మినెంట్ ఉద్యోగులు మాదిరిగానే 62ఏళ్ల వరకు కొనసా గించాలని, ఇటీవల మరణించిన తుపాకుల రవణమ్మ, బొమ్మాలి వెంకట్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం సంబంధిత కరపత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు దుర్గా రావు, శ్రీను, విక్రం, రామునాయుడు, రాము, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/nml-cpm.jpg)