ప్రజాశక్తి – పూసపాటిరేగ : మండలంలోని కోనాడలో శనివారం జనసేన కార్యకర్తలు చేస్తున్న పల్లె పండగ పనులను టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. జనసేన కార్యకర్త వాసిపల్లి సురేష్ చేపట్టిన 200 మీటర్ల సిసి రోడ్డు పనులను ఆపేయాలంటూ టిడిపి కార్యకర్తలు పట్టుబట్టారు. కూటమి ధర్మం పాటించకుండా పనులు నిర్వహించడం ఏంటని టిడిపి ప్రశ్నించారు. శుక్రవారం పనులు ఆపేయాలని చెప్పినప్పటికీ మరల శనివారం కూడా కొనసాగించడం ఏంటని మండిపడ్డారు. దీనిపై కూటమి నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలు ఆదివారం పోలీస్ స్టేషను వచ్చి సమస్య పరిష్కరించేలా మాట్లాడు కోవాలని పోలీసులు తెలిపినట్లు సమాచారం. వెండర్ కోడ్ ఉంటుండగా టిడిపి వాళ్ళు పనిచేయనివ్వకుండా అడ్డుపడుతున్నారంటూ జనసేన కార్యకర్త సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపితో కుమ్మక్కై పనిచేయకుండా అడ్డుపడుతున్నారనీ ఆరోపించారు. పొత్తు ధర్మం పాటించకుండా పనులను నిర్వహిస్తే ఊరుకునేది లేదని టిడిపి నేతలు కూడా వాగ్వివాదం చేస్తున్నారు. కోనాడలో జరిగిన వాగ్వివాదం ఎమ్మెల్యే లోకం నాగ మాధవకి, టిడిపి పెద్దలకు తెలిసింది. దీనిపై పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.లింగాలవలసలో పల్లె పండగ పనులు అడ్డగింతభోగాపురం: మండలంలోని లింగాలవలస గ్రామంలో పల్లె పండగ పనులను టిడిపి నాయకులు శనివారం అడ్డుకున్నారు. జెసిబితో జనసేన నాయకులు పనులు నిర్వహిస్తుండగా గ్రామ సర్పంచ్ బుగత లలిత, టిడిపి నాయకులు బుగత రామ్మోహన్, ఓదూరి నర్సింహులు, బర్ల శీను పనులను నిలిపివేశారు. పంచాయతీలో టిడిపి సర్పంచ్ ఉన్నప్పటికీ వారికి పనులు కేటాయించకుండా జనసేనకు పనులు కేటాయించడంతోనే అడ్డుకున్నామని టిడిపి నాయకులు తెలిపారు.