జామికి స్థలం కరువు

Feb 16,2025 21:30

ప్రజాశక్తి – జామి: ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుంది జామి మండల కేంద్రంలోని అభివృద్ధి పరిస్థితి. మండలానికి సగభాగానికి జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రాతినిద్యం వహించగా, సగభాగానికి మూడు సార్లు గెలిచిన సినియర్‌ శాసన సభ్యులు కోళ్ల లలితకుమారి ప్రాతినిద్యం వహిస్తున్నారు. కానీ జామి గ్రామానికి ఏ ఒక్క అభివృద్ధి పనీ దరిచేరడం లేదని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మండలానికి మోడల్‌ స్కూల్‌ మంజూరైనా, నిర్మించడానికి స్థలం లేదని అధికారులు, రాజకీయ నాయకలు చేతులు దులుపుకుంటున్నారని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మోడల్‌ స్కూలే కాదు.. మండల కేంద్రానికి డంపింగ్‌ యార్డు, చివరికి శ్మశాన వాటికకు కూడా స్థలం లేని దౌర్భాగ్య పరిస్థితిని జామి ప్రజలు ఎదుర్కొంటున్నారు. దీనంతటికీ రాజకీయ నాయకుల చిత్త శుద్ధి లోపమే అని కొందరంటే, లేదు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజాశక్తి ప్రత్యేక కథనం..జామి మేజరు పంచాయతీలో 16 వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఏడాదికి సుమారుగా రూ.65 లక్షల వార్షిక బడ్జెట్‌ అంచనా కలిగిన మేజరు పంచాయతీ ఇది. ఇంత ఆదాయం ఉన్న గ్రామంలో అరకొర కాంట్రాక్ట్‌ పనులు తప్ప, గ్రామ మౌలిక సదుపాయాల కల్పన నామమాత్రమే. అభివృద్ధి పనుల విషయానికి వస్తే, స్థలం లేదన్న వంకతోవాటిని దూరం చేస్తున్నట్లు ఆరోపణులు వస్తున్నాయి. గతంలో కస్తూరిభా స్కూల్‌ను మండల కేంద్రంలో స్థలం లేదని కుమారం పంపేసిన విషయం తెలిసిందే. నేడు కెజిబివి వసతి గృహం, మోడల్‌ స్కూల్‌ నిర్మాణానికి అదే పరిస్థితి. ఈ తరుణంలోనే జామి అభివృద్ధికి నోచుకోవడం లేదన్న వాదన వినిపిస్తుంది. క్వారీల చుట్టూ వందల ఎకరాలుజామి మాధవరాయమెట్ట గ్రామం చుట్టు వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములు క్వారీ కాంట్రాక్టుల చేతిలో ఉన్నాయి. క్వారీలు, క్రషర్లు పేరిట భూములను కాజేసినట్లు ఆరోపనులు ఉన్నాయి. గతంలో క్వారీలపై వేలాది మంది కార్మికులకు ఉపాధి లభించేది. కానీ నేడు ఉపాధి లేక క్వారీ కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్న పరిస్థితి. పైగా ఎంఆర్‌ కాలనీ చుట్టూ దుమ్మూ, ధూలీ వ్యధజల్లే క్రషర్లను, అక్రమ క్వారీలను నిలుపుదల చేయాలని పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ క్రసర్లు, క్వారీలు నిలుపుదల చేసి, వాటి చెరలో ఉన్న ప్రభుత్వ భూముల్లో మోడల్‌ స్కూల్‌ నిర్మాణం చెపట్టేలా అధికారులు, నాయకులు ఆలోచన చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తుంది.శ్మశాన వాటిక, డంపింగ్‌ యార్డ్‌కు స్థలం లేదుజామి గ్రామానికి శ్మశాన వాటిక జాతీయ రహదారి నిర్మాణంతో కొంత భాగం మాత్రమే మిగులుంది. ఇది ఊరు జనం అవసరాలకు సరిపోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటిక అభివృద్ధి సంగతి అంటుంచితే, చితి కాల్చడానికే స్థలం లేని పరిస్థితి. గ్రామంలో రోజుకు సుమారుగా 4 యూనిట్లు చెత్త సేకరిస్తారు. కానీ ఆ చెత్తను వేసేందుకు యార్డు లేదు. దీంతో ప్రతి రోజూ సేకరించిన చెత్తను గోస్తనీ నదీ గర్భంలో వేస్తున్న పరిస్థితి. వీటన్నింటికీ స్థలాన్ని బూచిగా చూపిస్తున్న అధికారులు, క్వారీలు, క్రషర్లు చుట్టూ ఉన్న ఆక్రమణల జోలికి వెళ్లకుండా, అభివృద్ధిని కుంటి పరుస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.అభివృద్ధి పై ఆలోచన చేస్తున్నాం జామి గ్రామంలో శ్మశానం, డంపింగ్‌ యార్డుల విషయంపై పాలకవర్గం ఆలోచన చేస్తుంది. యల్లారమ్మ జాతర అనంతరం డంపింగ్‌ యార్డు పై చర్యలు తీసుకుంటాం.- ఎన్‌. రమణారావు, ఇఒ, జామి

➡️