ఎర్రచెరువు పేదలకు న్యాయం చేయాలి

Jan 9,2025 21:00

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని ఎర్ర చెరువు గర్భంలో నివాసముంటున్న వారు అక్కడినుంచి ఖాళీ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ నోటీసు జారీ చేయడం పట్ల పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకరరావు ఖండించారు. దీన్ని నిరసిస్తూ పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఇళ్లు చెరువు గర్భంలో లేవని, వారికి ప్రభుత్వమే పట్టాలిచ్చిందని, బ్యాంకులు రుణాలిచ్చి ఇల్లు కట్టించారని తెలిపారు. ఇప్పుడు చెరువు గర్భంలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం సరైనది కాదన్నారు. తాత, తండ్రుల నుండి ఇక్కడే నివాసముంటున్నారని, వీరికి పట్టాలు, కరెంటు, మున్సిపల్‌ పన్ను, ఇంటి రుణం కూడా మంజూరు అయ్యాయని తెలిపారు. వాస్తవానికి చెరువు కబ్జా చేసి నవారి పై చర్యతీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పోరాడుతుంటే పేదలjఱ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. 46వ వార్డు గురజాడ నగర్‌, వినాయక నగర్‌లో కనీసం తాగేందుకు మంచి నీరులేదని, వెంటనే ట్యాంకర్‌ ద్వారా నీరు పంపించాలని కోరారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, పిపిఎస్‌ఎస్‌ నాయకులు ఆది, చంటి, సాయి,సూరిబాబు, రవి, తదితరులు పాల్గొన్నారు.

➡️