కాయ్‌ రాజా కాయ్‌

May 16,2024 20:12

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌/బొబ్బిలి : పోలింగ్‌ ముగిసింది. కౌంటింగే మిగిలింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎవరు గెలుస్తారోనన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఏ ఇద్దరూ కలిసినా ఒకటే చర్చ .. ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఇక్కడ ఎవరు ఓడిపోతారోనని ఒకటే చర్చ. ఈ క్రమంలో అంతేస్థాయిలో పందేలు ఊపందుకున్నాయి. కొందరు గెలుపు ఓటములపై పందేలా కాస్తే, మరికొందరు మెజార్టీపై బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఇప్పటివరకూ ఐపిఎల్‌ క్రికెట్‌లో పందేలు కాయడం చూసిన ప్రజలు తాజాగా ఎన్నికల్లో గెలుపు ఓటములపై కోట్లాది రూపాయలు పందేలు జరగడం చూసి విస్తుపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు అన్ని చోట్లా టిడిపి, వైసిపి మధ్య హోరాహోరా పోటీ జరిగింది. ఎక్కువ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. అభ్యర్థుల గెలుపోటములపై ఒక లెక్క అయితే, వచ్చే మెజార్టీపై మరో లెక్క. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాట్లపై మరో పందేం ఇలా రకరకాలుగా జూదం నడుస్తోంది ఇందులో ఒక్కో నియోజకవర్గంపై ఒక్కో రకంగా పందేలు నడుస్తుండటం గమనార్హం. కొన్నిచోట్ల వైసిపికి చెందిన వారు రూ.లక్ష పెడితే టిడిపికి చెందిన వారు రూ.2లక్షలు, మరికొన్ని నియోజకవర్గాల్లో వైసిపి వారు ఎక్కువ, టిడిపి వారు తక్కువ మొత్తంలో పెట్టి బెట్టింగ్‌లు కాస్తున్నారు. తమ అభ్యర్థులు తప్పనిసరిగా గెలుస్తారన్న అంచనాలే ఇందుకు కారణం. కీలకమైన నాయకులు బరిలో ఉన్న చోట పందేలు కూడా ప్రతిష్టాత్మకంగానే మారుతున్నాయి. ప్రధానంగా విజయనగరం, బొబ్బిలి, ఎస్‌.కోట, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో ఎక్కువగా పందేలు జరుగుతున్నాయి. విజయనగరం అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనే అంశం మొదలుకుని కీలకమైన అభ్యర్ధులు సాధించే మెజార్టీల వరకు అన్నింటిపైనా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. వేలల్లో, లక్షల్లో పందేలు సాగుతుండటం విశేషం. నియోజకవర్గంలో టిడిపి కూటమి, వైసిపి అభ్యర్థుల విజయావకాశాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీల, అభ్యర్థుల గెలుపోటములను విశ్లేషించేందుకు ఆయా పార్టీలవారీగా రాజకీయ నిపుణులు రంగంలోకి దిగారు. వీరు బూత్‌ల వారీగా పోలైన ఓట్ల వివరాలు, వాటిలో యువత ఎంతమంది, మహిళలు ఎంత మంది అనే వివరాలు సేకరించి పార్టీలకు ఓట్లు ఎలా పడి ఉంటాయని అంచనాకు వస్తున్నారు. ఆయా బూత్‌ల్లో పార్టీలకు ఉన్న పట్టును కూడా పరిగణనలోకి తీసుకుని గెలుపోటములను అంచనా వేస్తున్నారు. బూత్‌లవారీ లెక్కలు వేసుకుని ఒక అంచనాకు వచ్చిన తర్వాత బెట్టింగ్‌ కోసం సమాచారాన్ని పంపుతున్నారు.. బెట్టింగ్‌ బాబుల్లో అధికశాతం ఈసారి ప్రధాన పార్టీల ద్వితీయశ్రేణి నాయకులే ఉండటం గమనార్హం. బెట్టింగ్‌ కు ముందుకొచ్చిన వారు ముందుగా ఒప్పంద పత్రం రాసుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ఒక నమ్మకమైన వ్యక్తి దగ్గర బెట్టింగ్‌ మొత్తాన్ని ఉంచుతున్నారు. ఫలితం తేలిన తర్వాత ఆ వ్యక్తి ఒప్పందం ఆధారంగా నగదును ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మధ్యవర్తులుగా ఉన్నవారికి భారీగానే గిట్టుబాటవుతోంది. పందెం మొత్తంలో 5 నుంచి 10 శాతం కమీషన్‌ రూపేణా మధ్యవర్తులకు అందజేయాలని ఒప్పందం కుదుర్చు కుంటున్నారు. వారువేసుకున్న లెక్కలు ఆధారంగా కొంతమంది 100కు 80, మరి కొంతమంది 100 కి 100 అంటూ పందేలు కాస్తున్నారు. డబ్బులు లేని వారు బంగారం,భూములు , కొన్ని వస్తువులకు కూడా పందేలు కాస్తున్నారు. విజయనగరం నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు రూ.30 కోట్ల మేర బెట్టింగులు జరిగినట్లు అంచనా. జూన్‌ 4న ఫలితాలు వెలువడే నాటికి ఈ బెట్టింగులు రెట్టింపయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. టిడిపి, వైసిపికి చెందిన వారు ఎక్కువగా పందేలు కాస్తున్నారు. బేబినాయన గెలుస్తారని రూ.ఒక లక్ష పెడితే వైసిపి గెలుస్తుందని రూ.50 వేలు బెట్టింగ్‌ వేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొంతమంది బెట్టింగ్‌ వేయగా వైసిపి అధికారంలోకి వస్తుందని మరికొంతమంది బెట్టింగులు వేస్తున్నారు. బొబ్బిలి పట్టణం, రామభద్రపురం, బాడంగి, తెర్లాం, బొబ్బిలి మండలాల్లో టిడిపి, వైసిపి కార్యకర్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బెట్టింగులు కాస్తున్నారు. కమీషన్‌ కోసం కొంతమంది బ్రోకర్లు ఇరు పార్టీల మద్దతుదారులను బెట్టింగులకు ప్రోత్సహిస్తున్నారు.

➡️