ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఖజానా నింపుకోవడానికి మద్యం దుకాణాలు పెంచి, ఆఘమేఘాలపై గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం, చౌక ధరల దుకాణాల ద్వారా కంది పప్పు ఇచ్చేందుకు మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు పప్పుల ధరలను కూడా అదుపు చేయడం లేదు. దీంతో, సామాన్యుడు పప్పుచారుకు కూడా నోచుకోలేని దుస్థితి దాపురించింది. మరోవైపు కూరగాయలు, నిత్యవసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. జిల్లాలో 581 తెల్లరేషన్‌కార్డులు ఉన్నాయి. వీరందరికీ కేజీ చొప్పున మొత్తం 581 టన్నుల కందిప్పు జిల్లాకు రావాల్సివుంది. కానీ, అక్టోబర్ నెలకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం జిల్లాకు చేరింది కేవలం 40టన్నులు మాత్రమే. అలాగని మిగిలిన 541టన్నులు వస్తుందనుకుంటే పొరపాటే. కొన్ని నెలలుగా జిల్లాకు కేవలం 260 టన్నులు మాత్రమే వస్తుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు జిల్లా పౌర సరఫరా శాఖ అధికారే స్పష్టం చేశారు. ఇందులోనూ సగానికి సగం పక్కదారి పడుతోంది. జిల్లాలో మూడు రోజులుగా బియ్యం, పంచదార సరఫరా జరుగుతోంది. చాలా మంది పంపిణీదారులు కంది పప్పు ప్రభుత్వం నుంచి రాలేదని చెబుతున్నారు. 20ప్యాకెట్లు మాత్రమే తమకు ఇచ్చారని కొందరు, 30ప్యాకెట్లు ఇచ్చారని మరికొందరు, పూర్తిగా ఇవ్వలేదని ఇంకొందరు చెబుతుండడమే ఇందుకు తార్కాణం. ప్రభుత్వ ఉదాసీనతను ఆసరాచేసుకుని, పంపిణీ దారులు కూడా కొద్దోగొప్పో పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కంది పప్పు ధర ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కేజీ రూ.200 పలుకుతోంది. ఆయిల్, ఇతర పప్పులు తదితర నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం టమాట ధర కూడా కేజీ రూ.100 ఉంది. అవి కూడా మార్కెట్‌లో తగినంతగా అందుబాటులో లేవు. మిగిలిన కూరగాయల ధరలు కూడా సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితి దాపురించింది. అలాగని ఆమేరకు రైతులకు ఒనగూరిందీ ఏమీ లేదు. ప్రభుత్వం ధరలను నియంత్రించకపోవడం వల్ల నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయి. మార్కెట్‌పై పర్యవేక్షణ లేకపోవడం వల్ల కూరగాయల రైతులు దోపిడీకి గురౌతున్నప్పటికీ, దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్యులు మూడు పూటలా కడుపు నిండా తినలేని పరిస్థితి ఏర్పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.