ప్రజాశక్తి- శృంగవరపుకోట : మండలంలో కిడ్నాప్ కలకలం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని ఎస్‌పి వకుల్ జిందాల్ సమక్షంలో బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్‌పి కేసు వివరాలను వెల్లడించారు. గత సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో మండలంలోని కొట్టాం గ్రామానికి చెందిన దంతులూరి వెంకట సూర్యనారాయణ రాజు ఇంటికి ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి తాము పోలీసులమని చెప్పి విచారణ చేపట్టాలని సూర్యనారాయణరాజును వారితో పాటు తీసుకెళ్లారు. ఆ తరువాత సదరు ఇద్దరు వ్యక్తులు బాధితుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.4లక్షలు ఇవ్వాలని, లేకపోతే సూర్యనారాయణ రాజును చంపేస్తామని బెదిరించినట్లు ఈ నెల 29న ఉదయం 8 గంటలకు బాధితుని అల్లుడు కాకర్లపూడి శివప్రసాద్ ఎస్.కోట పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఎస్. భాస్కర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఎస్‌ఐ భాస్కరరావు తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టి విశాఖపట్నం మధురవాడ, కొమ్మాది ప్రాంతాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు సూర్యనారాయణ రాజును కిడ్నాప్ చేసినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ చేసిన వారిలో మధురవాడకు చెందిన కసిరెడ్డి రాజు, అనే వ్యక్తికి దంతులూరి వెంకట సూర్యనారాయణ రాజు సుమారు 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. సూర్యనారాయణ రాజు ఆస్తిపరుడని తెలిసి కసిరెడ్డి రాజు అతని ఇద్దరు కుమారులైన ప్రవీణ్ కుమార్, సాయి, వారి స్నేహితులు మరొక నలుగురుతో కలిసి కిడ్నాప్ ప్రణాళిక వేశారు. ఇందులో భాగంగా కొట్టాం గ్రామం నుంచి ఈ నెల 28న ఉదయం ప్రాంతంలో పోలీసులమైన చెప్పి వారి ఇంటికి వెళ్లి విచారణ నిమిత్తం బాధితుడిని వారి కారులో ఎక్కించుకొని పద్మనాభం చుట్టు పక్కల ప్రాంతాలలో తిరుగుతూ బాధితుని కుటుంబ బంధువులకు నాలుగు లక్షల రూపాయలను ఇవ్వమని డిమాండ్ చేశారు. డబ్బులు కోసం ఎస్.కోట వైపుగా రెండు కారులలో వస్తుండగా బుధవారం ఉదయం ఉసిరి జంక్షన్ వద్ద ఎస్‌ఐ భాస్కరరావు వాహనాలు తనకి నిర్వహిస్తూ ఆ రెండు కారులను కూడా పరిశీలించేందుకు ప్రయత్నించారు. దీంతో కారులో ఉన్న కిడ్నాపర్లు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా నలుగురును పట్టుకుని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేశారు. మరొక ముగ్గురు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్‌పి తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వివరాలు సేకరించి వారిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో డిఎస్‌పి శ్రీనివాసరావు, సిఐ నారాయణమూర్తి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.