అధికారుల అవినీతితోనే భూ వివాదాలు

Apr 16,2025 21:01

ప్రజాశక్తి – బొబ్బిలి : రామభద్రపురం మండలంలోని రెవెన్యూ అధికారుల అవినీతితోనే భూ వివాదాలు పెరుగుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు విమర్శించారు. బొబ్బిలి సిపిఎం కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ రామభద్రపురం మండలంలోని ఉన్న ప్రభుత్వ భూములపై పెత్తందారుల కన్ను పడడం వారికి రెవెన్యూ అధికారుల అండదండలు ఉండడంతోనే భూ వివాదాలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పశువుల ఆసుపత్రికి 1964లో మూడడ్ల జగన్నాధంనాయుడు భూమి దానం చేస్తే ఆ స్థలంలో ప్రభుత్వం పశువుల ఆసుపత్రి నిర్మించిందన్నారు. రామభద్రపురం నడిబొడ్డున ఉన్న స్థలం రూ.కోట్ల విలువ చేయనుండడంతో ఆ స్థలంపై పెత్తందారుల కన్ను పడడం వల్ల ఆయన కుమారుడు మరణించినప్పటికీ కోడలుతో తమకు స్థలాన్ని అప్పగించాలని దరఖాస్తు చేపించి రెవెన్యూ అధికారులు అప్పగించారని విమర్శించారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని రెండేళ్ల క్రితం సిపిఎం పోరాటం చేసిందని చెప్పారు. జనసేన నాయకుడు మహంతి దనంజరు హైకోర్టులో కేసు వేయడంతో కక్ష పెట్టుకుని హత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. రామభద్రపురం మండలంలోని కొట్టక్కి, తారాపురం, కొండకెంగువ, గొల్లలపేట, నరసాపురం, రొంపల్లివలస తదితర గ్రామాలలో ప్రభుత్వ భూములు పెత్తందారుల చేతిలో ఉన్నాయని, ఆయా భూములను పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. కొట్టక్కి చెరువు ఆక్రమణపై ఏడాది క్రితం చెరువు అని బోర్డు పెట్టిన అధికారులు ఇప్పుడు జిరాయితి భూమి అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చెరువును కాపాడాలని సీపీఎం పోరాటం చేస్తే ఆక్రమణదారులు తమకు కోర్టు నోటీసులు పంపించడం అన్యాయమన్నారు. పశువుల ఆసుపత్రి స్థలంలో ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని డిమాండ్‌ చేశారు. లేనిచో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయనతో సిపిఎం మండల కన్వీనర్‌ ఎస్‌.గోపాలం ఉన్నారు.

➡️