నేతలు కనుసన్నల్లోనే బెట్టింగ్ లు

May 16,2024 11:30 #Vizianagaram

నగరంలో ఊపందుకున్న పందేలు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ మిగిలింది. ఈ నేపథ్యంలో పందేల జోరు మరింత ఊపందుకుంది. బెట్టింగ్‌రాయుళ్లు ఫలానా అభ్యర్థి గెలుస్తాడని, ఫలానా అభ్యర్థికి ఇన్ని ఓట్లు వస్తాయని, ఇంత మెజార్టీ వస్తుందని, ఫలానా పార్టీకి ఇన్ని ఓట్లు వస్తాయని ఇలా రకరకాలుగా బెట్టింగులు సాగుతుండటం విశేషం.  విజయనగరం అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనే అంశం మొదలుకుని కీలకమైన అభ్యర్ధులు సాధించే మెజార్టీల వరకు అన్నింటిపైనా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. వేలల్లో, లక్షల్లో పందేలు సాగుతుండటం విశేషం. నియోజకవర్గంలో టిడిపి కూటమి, వైసిపి అభ్యర్థుల విజయావకాశాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీల, అభ్యర్థుల గెలుపోటములను విశ్లేషించేందుకు ఆయా పార్టీలవారీగా రాజకీయ నిపుణులు రంగంలోకి దిగారు. వీరు బూత్‌లవారీగా పోలైన ఓట్ల వివరాలు, వాటిలో యువత ఎంతమంది, మహిళలు ఎంత మంది అనే వివరాలు సేకరించి పార్టీలకు ఓట్లు ఎలా పడి ఉంటాయని అంచనాకు వస్తున్నారు. ఆయా బూత్‌లో పార్టీలకు ఉన్న పట్టును కూడా పరిగణనలోకి తీసుకుని గెలుపోటములను అంచనా వేస్తున్నారు. బూత్‌లవారీగా లెక్కలు వేసుకుని ఒక అంచనాకు వచ్చిన తర్వాత బెట్టింగ్ కోసం సమాచారాన్ని పంపుతున్నారు.. బెట్టింగ్ బాబుల్లో అధికశాతం ఈసారి ప్రధాన పార్టీల ద్వితీయశ్రేణి నాయకులే ఉండటం గమనార్హం. నియోజకవర్గ స్థాయిలో ఆయా పార్టీల్లో ముఖ్య నేతలుగా ఉన్నవారు కూడా బెట్టింగ్ నిర్వాహకులుగా వ్యవ హరిస్తున్నారు. కేవలం విజయనగరం లో టిడిపి కూటమి, వైసిపికి చెందిన నేతలు బెట్టింగ్ వ్యవహారాలకు కేంద్రంగా మారడం గమనార్హం. మధ్యవర్తులకు డబ్బే డబ్బు. ఈసారి బెట్టింగ్ పక్కాగా కాసేవారు వ్యవహరిస్తున్నారు. బెట్టింగ్ కు ముందుకొచ్చిన వారు ముందుగా ఒప్పంద పత్రం రాసుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ఒక నమ్మకమైన వ్యక్తి దగ్గర బెట్టింగ్ మొత్తాన్ని ఉంచుతున్నారు. ఫలితం తేలిన తర్వాత ఆ వ్యక్తి ఒప్పందం ఆధారంగా నగదును ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మధ్యవర్తులుగా ఉన్నవారికి భారీగానే గిట్టుబాటవుతోంది. పందెం మొత్తంలో 5 నుంచి 10 శాతం కమీషన్ రూపేణా మధ్యవర్తులకు అందజేయాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వారువేసుకున్న లెక్కలు ఆధారంగా కొంతమంది 100 కి 80, మరి కొంతమంది 100 కి 100 అంటూ పందేలు కాస్తున్నారు. డబ్బులు లేని వారు బంగారం,భూములు , కొన్ని వస్తువులకు కూడా పందేలు కాస్తున్నారు.
విజయనగరం నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు రూ.30 కోట్ల మేర బెట్టింగులు జరిగినట్లు అంచనా. జూన్ 4 న ఫలితాలు వెలువడే నాటికి ఈ బెట్టింగులు రెట్టింపయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

➡️