విద్యారంగాన్ని కాపాడుకుందాం

Feb 8,2025 21:12

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వం జిఒ 117 పేరుతో విచ్చిన్నం చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం కొన్ని పాఠశాలలను మోడల్‌ స్కూల్స్‌గా మార్చి, మిగిలిన వాటిని ఫౌండేషన్‌ స్కూల్స్‌గా మార్చే ప్రయత్నం చేయటం చేస్తుందని, ఈ పాఠశాలలను రక్షించుకునే బాధ్యత తల్లిదండ్రులతో కలిసి ఉపాధ్యాయులకు ఉందని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు కోరారు. శనివారం నెల్లిమర్లలో యుటిఎఫ్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 12,500 ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని, వీటిలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య వచ్చే అవకాశం లేదని, ప్రస్తుతం మోడల్‌ స్కూల్స్‌ స్థాపిస్తామని చెప్పే దానికోసం చేస్తున్న కసరత్తులో మరిన్ని ఎక్కువ పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. ప్రస్తుతం పిల్లల సంఖ్య ఎక్కువ ఉన్నచోట మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌గా మార్చాలని, మిగిలిన పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకాన్ని కలిగించడం కోసం తల్లిదండ్రులని ఉపాధ్యాయులు కలవాలని, వారికి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యార్థులను తయారు చేయడం కోసం బాధ్యత తీసుకుంటామని హామీని ప్రతి ఉపాధ్యాయుడు ఇవ్వాలని కోరారు. తద్వారా ప్రభుత్వ బడిలో పిల్లల్ని చేర్పించాలని ప్రభుత్వ బడి బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 12వ పిఆర్‌సి కమిషన్‌ చైర్మన్‌ తక్షణం నియమించాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, ఉద్యమాలతో ప్రజల పక్షాన నిలబడే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జి.వి.రమణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాస రావు, జెఎవిఆర్‌కె ఈశ్వర్‌ రావు, జిల్లా కార్యదర్శులు పతివాడ త్రినాథ్‌, సిహెచ్‌ తిరుపతి నాయుడు, మద్దిల రాజు, హరి మోహన్‌ రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️